వికారాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు మణిహారంగా మారనున్నదని భావించిన మొబిలిటీ వ్యాలీకి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నది. భూసేకరణ పూర్తై మూడేళ్లు పూర్తైనా మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జిల్లా ప్రజల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి రావడంతో ఏడాదిన్నరకు మొబిలిటీ వ్యాలీలో రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు కాంగ్రెస్ సర్కారు రూ.45 కోట్లను గతేడాది ఏప్రిల్‌లో మంజూరు చేయగా, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మంత్రి పనులు ప్రారంభించి దాదాపు ఏడాది అవుతున్నా మొబిలిటీ వ్యాలీలో పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే సాక్షాత్తు మంత్రి శ్రీధర్ పనులను ప్రారంభించిన శిలాఫలకం మొబిలిటీ వ్యాలీకి ఎంపిక చేసిన ప్రాంతంలో ఎక్కడ కనపడకపోవడం గమనార్హం. మంత్రి పనులు ప్రారంభిస్తే శిలాఫలకాన్ని మాయం చేయడమేమిటని రోడ్ల అభివృద్ధి పనులు చేస్తున్నవారిని అడుగగా.. తాత్కాలిక శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారని, పనులు ప్రారంభించిన రోజే సంబంధిత అధికారులు తీసుకెళ్లిపోయినట్లు తెలిసింది. మొబిలిటీ వ్యాలీలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ట్రాక్‌లోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరొస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం.. మోమిన్‌పేట్ మండలం ఎన్కతలలో చేపట్టిన మొబిలిటీ వ్యాలీతోపాటు అర్కతలలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విషయంలో అడుగు ముందుకు పడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
రూ.50 వేల కోట్ల పెట్టుబడే లక్ష్యంగా మొబిలిటీ వ్యాలీ
మోమిన్‌పేట్ మండలం ఎన్కతలలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ వ్యాలీతో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 940 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలను మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నారు. మొబిలిటీ వ్యాలీకి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ కూడా మూడేళ్ల క్రితం పూర్తి కాగా.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో భూ అభివృద్ధి పనులు కూడా షురూ చేశారు. మరోవైపు మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను పారిశ్రామికాభివృద్ధికి ఇచ్చిన అసైనీలకు గత ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేసింది. ఎన్కతల గ్రామపంచాయతీ సర్వే నం.174, 198 పరిధిలోని 636.11 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన 400 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.17 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని జమ చేసింది.
అసైన్డ్‌దారుల కుటుంబాల్లోని అర్హులైన వారికి తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఉద్యోగాలను కూడా కల్పించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్కతలలో ప్రధానంగా అసైన్డ్‌దారుల కుటుంబాల పిల్లలకు నాణ్యమైన చదువును అందించే నిమిత్తం ప్రత్యేకంగా బాలురు, బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. కొత్త ప్రభుత్వం అసైన్డ్‌దారులకు ఉద్యోగాలు, తదితర సౌకర్యాలను కల్పించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆందోళన భూములిచ్చిన అసైన్డ్‌దారుల కుటుంబాల్లో నెలకొన్నది. మరోవైపు మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయనే ఆశతో ఉన్న స్థానికులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. మొబిలిటీ వ్యాలీని బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేయడంతో భూముల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. ఎకరం భూమి ధర చుట్టుపక్కల రూ.కోట్లలో పడగలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా దృష్టి సారించకవడంతో భూముల ధరలు పడిపోవడంతోపాటు చుట్టుపక్కల పూర్తిగా భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి.
కమ్ముకున్న నీలినీడలు
మొబిలిటీ వ్యాలీని పక్కన పెట్టి సీఎం సొంత నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కుతోపాటు పరిగి నియోజకవర్గంలోని పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించి త్వరతిగతిన సంబంధిత పనుల్లో వేగం పెంచడం గమనార్హం. రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మొబిలిటీ వ్యాలీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి నీలినీడలు కమ్ముకున్నాయి. మొబిలిటీ వ్యాలీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలకు.. కాంగ్రెస్ సర్కారులో ఇంకా సందిగ్ధం నెలకొనడంతో మొబిలిటీ వ్యాలీ ముందుకు సాగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో టీఎస్ఐఐసీ, టీఎస్-ఐపాస్ వంటి నూతన శకానికి నాంది పలకడంతోపాటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించగా.. కాంగ్రెస్ సర్కారు దాదాపు రెండున్నరేండ్లు దాటినా నూతన ఇండస్ట్రియల్ పాలసీని ఇప్పటివరకు అమల్లోకి తీసుకురాకపోవడం తదితర అంశాలపై పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొన్నది.
కేసీఆర్‌కు పేరొస్తుందని నిర్లక్ష్యం..
మోమిన్‌పేట్ మండలం ఎన్కతలలో ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలను తయారీ పరిశ్రమల యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మొబిలిటీ వ్యాలీని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చే క్రమంలోనే జిల్లా మణిహారంగా మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, రైతులను ఒప్పించి భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేశారు. భూసేకరణ పూర్తైన అనంతరం బీఆర్ఎస్ సర్కారు హయాంలో భూమిని చదును చేసి అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేయగా, అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి.
తదనంతరం కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర వరకు జిల్లాకు మణిహారం అనుకున్న మొబిలిటీ వ్యాలీ ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి ప్రస్తావించలేదు. తదనంతరం అభివృద్ధి పనులను ప్రారంభించినా ఏడాదిగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. మరోవైపు మొబిలిటీ వ్యాలీలో అభివృద్ధి పనులు పూర్తి చేసి పరిశ్రమలు ఏర్పాటైతే మాజీ సీఎం కేసీఆర్‌కు పేరొస్తుందని పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.