JETLEE GLIMPSE | ‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్లో ఒక కొత్త తరహా కామెడీని పరిచయం చేసిన కాంబో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమెడియన్ సత్య హీరోగా యువ దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్న సరికొత్త చిత్రం ‘జెట్లీ’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మేడిపండు చూడ మేలిమై యుండును..’ అనే వేమన పద్యంతో ఈ గ్లింప్స్ ప్రారంభం అయ్యింది. ఒక ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సాగే ఈ కామెడీ సన్నివేశాలు గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. “నువ్వు ఏ టైర్ హీరోవి?” అని వెన్నెల కిషోర్ వేసిన ప్రశ్నకు, సత్య తనదైన శైలిలో “నేను జనరల్ కంపార్ట్మెంట్ హీరోని” అంటూ సమాధానం ఇవ్వడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని నిర్మాత చెర్రీ తెలిపారు. ‘మత్తు వదలరా’ సిరీస్ తర్వాత వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులకు మరోసారి నాన్-స్టాప్ వినోదాన్ని పంచుతుందని దర్శకుడు రితేష్ రానా ధీమా వ్యక్తం చేశారు. ఇక వేసవి కానుకగా ‘జెట్లీ’ థియేటర్లలో సందడి చేయనుంది.