సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కార్పొరేషన్ల విభజన ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సర్కారు సిద్దమవుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్లో ఒకలా, శివారు మున్సిపాలిటీల్లో మరోలా పన్నుల వసూళ్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులున్నాయని.. వాటికి తెరదించాలని సర్కార్ భావిస్తున్నది. ఈ క్రమంలో ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్) పరిధిలో ఒకే పన్ను విధానంపై సర్కార్ దృష్టి సారించిందని సమాచారం.
ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పన్నుల లెకలను సరిచేసి, మూడు కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించిన దరిమిలా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో రెంటల్ వాల్యూ ( అద్దె ఆధారిత) పద్దతిలో పన్నులు కడుతుండగా..జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పురపాలికల్లో మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించిన మార్కెట్ వాల్యూ ప్రకారం పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే ఆస్తిపన్ను విధానంలో మార్కెట్ వాల్యూ ప్రకారం పన్నులు వసూలు చేసినైట్లెతే గ్రేటర్ ప్రజలపై మూడు నుంచి నాలుగు రేట్ల అధిక భారం పడే అవకాశాలుంటాయన కొందరు అధికారులు పేర్కొంటున్నారు.
ఏప్రిల్ నుంచి కొత్త విధానం!
వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి ఈ కొత్త యూనిఫాం ట్యాక్స్ సిస్టమ్ పట్టాలెకించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారుల స్థాయిలో లోతుగా అధ్యయనం పూర్తయినట్లు తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ మారెట్ వాల్యూ ఆధారంగానే పన్నుల నిర్ధారణ జరిగేలా చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 19.50 లక్షల ప్రాపర్టీ అసెస్మెంట్లు ఉన్నాయి.
ట్రై కార్పొరేషన్లు కలిపితే మొత్తంగా దాదాపు 23 లక్షలకు పైగా ఆస్తులు కొత్త విధానం పరిధిలోకి రానున్నాయి. ఇవన్నీ ఏకరీతిలోకి వస్తే ప్రస్తుతం ఏటా వస్తున్న రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం.. రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మారెట్ వాల్యూ ప్రాతిపదికన పన్నులు విధిస్తే పాతబస్తీ వంటి ప్రాంతాల్లో పన్నులు కట్టేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏప్రిల్ తర్వాత సరారు దీనిపై అధికారిక ముద్ర వేయనున్నట్లు సమాచారం.