Revanth Reddy | అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలను గొప్పగా వల్లెవేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీలోని చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపించానని.. ఇదీ తన చరిత్ర అంటూ చెప్పుకున్న గొప్పలను ఖండించింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని పేర్కొంది.
జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాయలసీమకు రోజుకు 3 టీఎంసీలు అంటూ ప్రకటనతో జగన్ ప్రభుత్వం ఈ పనులు చేపట్టిందని.. జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై అప్పటి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసు వేసిందని పేర్కొంది. కేంద్రం, ఎన్జీటీతో పాటు పలుచోట్ల ఫిర్యాదు చేసిందని చెప్పింది. తెలంగాణ ఫిర్యాదులను విచారించి.. అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలిచ్చిందని వివరించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులు నిలిపివేయించిందని స్పష్టం చేసింది.
చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార పార్టీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో సహా వాస్తవాలు బయటపెడతామని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్‌మీట్ పెట్టి విడుదల చేస్తారని స్పష్టం చేసింది.
నేను చెప్తే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపిండు – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/SRtn1Q6w0o
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026
తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై శనివారం నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను విమర్శిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. వైఎస్ జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి.. కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే.. నేను చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించా.. ఇదీ నా చరిత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు.’ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపితేనే మేం ఏదైనా విషయాలపై చర్చకు వస్తామని చంద్రబాబుకు సూటిగా చెప్పా. నా మాట మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపించారు. ఆ పనులు ఆగాయో.. లేదో తేల్చేందుకు నిజనిర్దారణ కమిటీని పంపించండి. కూనంనేని సాంబశివరావు, అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ మహేశ్వర్ రెడ్డితో ఆ కమిటీని వేయండి. కావాలంటే గతంలో సాగునీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన కేసీఆర్, హరీశ్‌రావు ఇద్దరిలో ఒకరిని దీనికి చైర్మన్‌గా నియమించి విచారణకు పంపించండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగాయో లేదో తేల్చుకోండి ‘ అంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలను కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ వెంటనే చంద్రబాబు సర్కార్ రేవంత్ గాలి తీసేసింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమని తేల్చిచెప్పింది.