ICC Rankings : భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది. ఇంగ్లండ్ పర్యటనలో తిప్పేస్తున్న ఆమె టీ20 బౌలర్ల ర్యాంకిగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. గత ఆరేళ్లుగా టాప్ -10లో ఉంటున్న దీప్తి.. ఒక ర్యాంక్ ఎగబాకి టాప్ 2గా నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ సదియా ఇక్బాల్‌కు, దీప్తికి 8 పాయింట్ల తేడానే ఉంది. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌కు కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. పేసర్ రేణుకా సింగ్ 6లో, రాధా యాదవ్ 18లో, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 11 స్థానాలు మెరుగుపరచుకొని 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో దీప్తి నిలకడగా రాణిస్తోంది. ఈమధ్యే ముక్కోణపు వన్డే సిరీస్ గెలుపొందడంలో ముఖ్య భూమిక ఆమెదే. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో కూడా దీప్తి బ్యాటుతో, బంతితో చెలరేగిపోతోంది. మూడో టీ20లో మూడు వికెట్లు తీసిన భారత స్టార్ టీ20ల్లో తన ర్యాంక్‌ను మెరుగుపరచుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఇసీ వాంగ్ 57వ, లారెన్ ఫిలర్ 68వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) టాప్ -5లో చోటు దక్కించుకుంది. ఇంగ్లండ్ గడ్డపై పరుగుల వరద పారిస్తున్న మంధాన మూడో ర్యాంక్ కైవసం చేసుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 12వ స్థానంలో ఉండగా ఈమధ్యే పునరాగమనం చేసిన షఫాలీ వర్మ 13, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15 వ స్థానంలో ఉన్నారు.