హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఆర్డీవో కార్యాలయాల నుంచి కాకుండా తహసీల్దార్ల ద్వారా ఎస్సీ ఉపకులాలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు భైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్యభవన్లో తెలంగాణ రాష్ట్ర మాలజంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్శశ్యామ్రావు అధ్యక్షతన ఆదివారం మాలజంగాల మహాసభ కొనసాగింది. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాలకు తహసీల్దార్ ద్వారానే కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.
57 ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మాలజంగాలను శైవక్షేత్రాల్లో పూజారులుగా నియమించి గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మాలజంగం కుల భవనం నిర్మాణం, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలూకా రాజేందర్, ముఖ్య సలహాదారులు రాజాం ఉమాపతి, పురం శివశంకర్, కన్వీనర్ మదారి ఉమాపతి, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్పుల సత్యమహేశ్, ఈసరి సత్యానందం, కొండ మ చెందర్, ఎల్పుల నాగరాజు, బొబ్బిలి ర మేశ్, గౌడి అమర్నాథ్ పాల్గొన్నారు.