కల్వకుర్తి, జూలై 31 : స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ‘కరెంట్’ షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీల ఆరు నెలల కరెంట్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు నోటీసులివ్వడంతో కార్యదర్శులు తలలు పట్టుకోవాల్సి వస్తున్నది. జీపీల అభివృద్ధికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కరెంట్ బిల్లులు కట్టుమంటే ఎక్కడినుంచి తెచ్చికట్టాలంటూ సర్పంచులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులకే నిధుల్లేక తల్లడిల్లుతుంటే.. బిల్లులు చెల్లించాలని గొంతుపై కత్తిపెట్టడం అన్యాయమని మండిపడుతున్నారు. కేంద్రం నుంచి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నామని, రాష్ట ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేసి కరెంట్ బిల్లులు అడుగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో సర్పంచ్‌లు గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నారు. అంతో ఇంతో ఈ నిధుల నుంచి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చాలాచోట్ల సీసీరోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి, జీపీ భవనాల మరమ్మతులకు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక అధికారుల పాలన ఉన్నప్పుడు జీపీల ట్రాక్టర్ కిస్తీలు, ఇతర ఖర్చులు పేరుకుపోయాయి. ఇది కాకుండా గతంలో మాజీ సర్పంచ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులకు కూడా సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధుల నుంచే ఇవ్వాల్సి వచ్చింది.
ఇలా పలు కారణాల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో నిధులు నిండుకున్నాయి. గ్రామ పంచాయతీల్లో నెలవారీ ఖర్చులకు కూడా నిధుల్లేని పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో కరెంట్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం చాలా బాధగా ఉన్నదని వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రూ.32,06,57,151 కోట్ల బకాయిలుండటం గమనార్హం.
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) రూపొందించే సమయంలో గ్రామసభలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులుపుకొన్నది. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకుంటున్న నేపథ్యంలో కరెంట్ బిల్లులకు డబ్బులు చెల్లించేందుకు ఎస్ఎఫ్సీ నిధులు వాడుకొనే వెసులుబాటు ఉంటుంది. ఎస్ఎఫ్సీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా కరెంట్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో అర్థమేమున్నదని సర్పంచులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కొన్ని చిన్న జీపీల్లో పనిచేసే ఒకరిద్దరు సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని, అటువంటి గ్రామ పంచాయతీల్లో లక్షల కరెంట్ బిల్లు ఎలా చెల్లిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఎఫ్సీ నిధులు ఇచ్చి కరెంట్ బిల్లులు కట్టమంటే కడుతామని, లేనిపక్షంలో కరెంట్ బిల్లులు కట్టలేమని సర్పంచులు తేల్చిచెబుతున్నారు. కరెంట్ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవొద్దని నాగర్‌కర్నూల్ జిల్లా సర్పంచులు గత వారం ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం జీపీలకు నిధులివ్వకుండా కరెంట్ బి ల్లులు చెల్లించమం టే ఎక్కడినుంచి తేవాలి. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన ని ధులు గ్రామ అవసరాలకే సరిపోతున్నాయి. జీపీల మరమ్మతులు, కంప చెట్లు తొలగించడం, కొత్తగా మురుగు కాల్వలు, సీసీ రోడ్డు వేయించాం. దీనికి తోడు గతంలో సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా కడుతున్నాం. ఇంకా డబ్బులు ఎక్కడ ఉంటాయి.
– రాంభీష్మ, సర్పంచ్, డిండిచింతపల్లి, వంగూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లే గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదా య వనరు. జీపీలకు ప్రత్యేకంగా వచ్చే ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పన్నుల రూపంలో ఏదైనా ఆదాయం వచ్చినా ఒకరిద్దరి సిబ్బంది జీతాలకు కూడా సరిపోదు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధులు ఇస్తే కరెంట్ బిల్లులు కట్టే వెసులుబాటు వస్తుంది.
– యాదగిరిరెడ్డి, సర్పంచ్, ఎంగంపల్లి. కల్వకుర్తి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
