సూర్యాపేట అర్బన్ మార్చి 15 : జిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారుతోంది. మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో వారిని లక్ష్యంగా చేసుకున్న దళారులు,అధికారుల అండతో దోచుకుంటున్నారు. జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులు దాడులు జరిపి, గతంలో పని చేసిన జిల్లా అధికారులను పట్టుకున్నా వైఖరిలో మార్పు రావడం లేదు. జిల్లాలోని నూతన సభ్యత్వాల కోసం అర్హత కలిగిన మత్స్యకార కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్న దళారులు, అధికారులు నకిలీ సభ్యత్వ పుస్తకాలను మత్స్యకారులకు అందించి అందిన కాడికి దోచుకుంటున్నారు. అంతేకాక ఉచితంగా కల్పించాల్సిన సభ్యత్వాలకు ప్రతి సభ్యుడి నుంచి రూ. 3 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు.
లంచాలు అధికంగా ఇచ్చిన వారికి అర్హత లేకున్నా సభ్యత్వం కల్పిస్తూ జేబులు నింపుకుంటున్నారు. లంచాలు చెల్లించిన ఫైల్ వారం పది రోజుల్లోనే పూర్తవుతున్నాయి . పైసలు చెల్లించిన వారి ఫైలు త్వరగా పూర్తి చేసి పైసలు ఇవ్వని వారి ఫైళ్లు మాత్రం మూలకు పడేస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. దళారులు వసూలు చేసిన సొమ్మును సిబ్బంది, అధికారులు బస్టాండు, టీ స్టాళ్లే అడ్డాగా పెట్టుకోవడంతో రూ. లక్షలు చేతులు మారుతున్నాయి.
లంచాలకు అలవాటు పడిన అధికారులు మత్స్యకారులకు సభ్యత్వాలు కల్పిస్తామని చెప్పి మధ్యవర్తుల ద్వారా ప్రతి సభ్యత్వానికి రూ.3 నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పేద, మధ్యతరగతికి చెందిన మత్స్యకారుల నుంచి దళారుల ద్వారా ఆ గ్రామంలోని పెద్ద మనుషుల సాయంతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవగాహన లేని మత్స్యకారులు సభ్యత్వాల కోసం తప్పక చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యశాఖలో లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులు, కార్యాలయ సిబ్బంది కలెక్టరేట్లో వసూలు చేస్తే సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని గమనించి బస్టాండ్లు, టీస్టాళ్లలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే వారు వారు వసూలు చేస్తున్న బస్టాండ్లు, టీస్టాళ్లలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయని గమనించకపోవడం కొసమెరుపు.
మత్స్యకారులు పెంచుకున్న చేపలను పట్టుకునేందుకు ప్రభుత్వానికి నామమాత్రంగా ఫీజు చెల్లించి అనుమతి పత్రం తీసుకోవాలి. అయితే గతంలో జిల్లా అధికారి ఒకరు అంతకు మించి డిమాండ్ చేయడంతో విసుగు చెందిన మత్స్యకారులు ఏసీబీని ఆశ్రయించి ఆయనను పట్టించారు. అయినప్పటికీ మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది తీరులో ఎటువంటి మార్పు రాలేదని మత్స్యకారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.