నిజాంసాగర్, మార్చి 15: చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడంతోపాటు క్రమశిక్షణ నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేస్తున్నది. కాగా ప్రస్తుతం వాటికి నిధులు సక్రమంగా మంజూరు కావడం లేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. గ్యాస్, కూరగాయలు, అద్దె భవనాల కిరాయిలకు సంబంధించిన బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాకపోవడంతో అంగన్వాడీ నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బకాయిలు పెరుగుతుండడంతో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు(సోమవారం, ఈనెల 16న) ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో ఈ నిధులు సరిపోవడం లేదని నిర్వాహకులు అంటున్నారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అనుకూలంగా గదులు, మరుగుదొడ్లు, తాగు నీటి సౌకర్యం ఉన్న భవనం తీసుకోవాలంటే గ్రామాల్లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పట్టణాల్లో రూ.4,000 నుంచి రూ.6,000 వరకు అద్దె చెల్లించాల్సి వస్తోందని వారు అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెతో కేంద్రాలను నిర్వహించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 52 కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణానికి మంజూరు వచ్చినా.. అవి నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లోనే కొనసాగించాల్సి పరిస్థితి ఏర్పడింది.
కామారెడ్డి జిల్లాలో 341 కేంద్రాలు అద్దె భవనాల్లోనే..
కామారెడ్డి జిల్లాలో మొత్తం 1,193 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 622 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 230 కేంద్రాలు కమ్యూనిటీ, పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాల్లో కొనసాగుతన్నాయి. మరో 341 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా సుమారు 79,280 మంది చిన్నారులు ప్రాథమిక విద్య, పోషకాహారం అందుకుంటున్నారు. అదనంగా 6,096 మంది బాలింతలు, 6,449 మం ది గర్భిణులు పోషకాహారం కోసం కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
నేడు చలో హైదరాబాద్..
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు చలో హైదరబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తామని, అయినా తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. కార్యకర్తలు, ఆయాలకు వేతనం రూ.18వేలకు పెంచాలని, సరిపడా నిధులు కేటాయించాలని, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా నేటి నుంచి ఒక పూట బడిని నిర్ణయించాలని కోరుతున్నారు. మే నెలలో కార్యకర్తలు, ఆయాలకు ఒకే సారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సెలవులను ప్రకటించాలనే డిమాండ్లను వారు ప్రభుత్వం ఎదుట ఉంచనున్నారు.
బిల్లులు రాక ఇబ్బందులు..
గ్యాస్ సిలండర్లు, కూరగాయాలు, ఇతర అవసరాల కోసం నిర్వాహకులు కొన్ని నెలలుగా తమ సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. అవి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వీటితోపాటు టీఏ, డీఏ బకాయిలు కూడా ఏండ్లుగా చెల్లించడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల్లోనే సమస్యలు పరిష్కరించాలి..
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు తక్కువ వేత నం ఉన్నా సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. నెలకు కనీసం 18వేల రూపాయల వేతనం పెంచుతూ.. మా సమస్యలను ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం పరిష్కరించాలి. ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి. సమస్యలు పరిష్కరించని పక్షంలో త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం.
-విజయలక్ష్మి, కార్యకర్త, కందర్పల్లి, యూనియన్ కార్యదర్శి
ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌శాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి..
ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట బడి అమలు చేయాలి. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలు, ఆయాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెల రోజులు సెలవు ఇవ్వాలి. తమ డిమాండ్ల సాధన కోసం నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈనెల 23న కలెక్టరేట్లను ముట్టడిస్తాం.
-విజయ, కార్యకర్త, పెద్దకొడప్గల్