(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్‌జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంపై సర్వత్రా పొగడ్తల వర్షం కురుస్తున్నది. హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా శాంతియుత మార్గంలో 36 రోజులపాటు విద్యార్థులు దీక్షను సాగించడం.. చివరకు మూడు ప్రధాన డిమాండ్లను సాధించడంపై అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అహింస మార్గం: మహాత్ముడి అహింస మార్గంలోనే విద్యార్థి ఉద్యమం కొనసాగింది. 36 రోజులుగా దీక్ష కొనసాగినా.. ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. శాంతి-భద్రతల సమస్య ఎదురవ్వలేదు. దీంతో విద్యార్థి ఉద్యమానికి అంతటా మద్దతు లభించింది.
దేశభక్తి: ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తే, జాతీయ జెండాను నేలపై పడిపోకుండా పలువురు విద్యార్థులు పట్టుకొంటున్న వీడియోలు అందరిలో దేశభక్తిని రగిల్చాయి. ఇది ఉద్యమ తీవ్రతను మరింత పెంచాయి.
డిమాండ్లపై స్పష్టత: మొదటి నుంచి విద్యార్థి ఉద్యమం ఎంతో స్పష్టతతో నడిచింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు, ప్రాణాలు తీసుకొన్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలతో పాటు విద్యార్థులపై కేసుల ఎత్తివేత.. ఇవే మూడు ప్రధాన డిమాండ్లతో చివరి వరకూ విద్యార్థులు పోరాడటం సాగించడం అందర్నీ ఆకర్షించింది.
డెడ్లైన్లతో ఉక్కిరిబిక్కిరి: తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శించకుండా విద్యార్థులు జాగ్రత్తపడ్డారు. రెండో భేటీకి, మూడో భేటీకి మధ్య కేవలం 24 గంటల సమయం ఇచ్చి.. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, ప్రధాని మోదీనే టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది.
సోషల్ మీడియా, ఏఐ వాడకం: ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో విద్యార్థులు సాంకేతికతను ఓ ఆయుధంగా మలుచుకొన్నారు. సోషల్‌మీడియా సాయంతో యావత్తూ దేశ ప్రజల మద్దతును కూడగట్టారు. ఏఐతో రూపొందించిన కొన్ని ఊహాజనిత వీడియోలతో ఉద్యమ తీవ్రతను పెంచారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు: జాతీయ మీడియా ఛానెళ్లు కొన్ని విద్యార్థుల ఉద్యమాన్ని తొలుత పట్టించుకోలేదు. దీంతో సోషల్ మీడియాను జెన్‌జీ విరివిగా వాడుకొన్నది. నిరసనలపై అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా కథనాలను ప్రచురించింది. రాయిటర్స్, అల్‌జజీరా వంటి సంస్థల ప్రతినిధులు స్వయంగా ఢిల్లీకి వచ్చి కవరేజీ ఇవ్వడంతో నేషనల్ మీడియా కూడా ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది.
ఏకమైన యావత్తు జాతి: విద్యార్థుల ఉద్యమానికి యావత్తూ దేశ ప్రజానీకం బాసటగా నిలిచింది. జంతర్ మంతర్‌కు వేలాదిమంది ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. విద్యార్థులపై పోలీసులు దాష్టీకానికి దిగకుండా పలువురు సెలెబ్రిటీలు అర్ధరాత్రిళ్లు నిరసన వేదికలోనే గడిపారు.
మీ అడ్డా కాదు.. మా అడ్డాకు: చర్చల విషయంలోనూ విద్యార్థి నేతలు చాలా కచ్చితత్వాన్ని కొనసాగించారు. చర్చలకు మంత్రుల ఇంటికి రావాలన్న ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించి.. నిరసన వేదికకు వచ్చి మాట్లాడాలని ప్రభుత్వ ప్రతినిధులకు స్పష్టం చేశారు.