సిద్దిపేట, మార్చి 15: బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషిచేసిందని, దేశంలో తొలిసారిగా ఇమామ్,మౌజమ్‌లకు వేతనాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట మిలాన్ గార్డెన్లోలో సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తనలో శక్తి ఉన్నంత వరకు సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానన్నారు. సిద్దిపేట ఫౌండేషన్ అధినేత సాదాత్ నజీర్ ఫౌండేషన్‌ను స్థాపించి నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు అభినందించారు.
పండుగలప్పుడు కుల మతాలకతీతంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టి అండగా నిలిచారన్నారు. కేసీఆర్ కిట్టు అందించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అనేక హామీలిచ్చి గద్దెనెక్కి ప్రజలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు రూ. 4 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి రూపాయి విడుదల చేయలేదన్నారు.
ఇమామ్, మౌజమ్ల వేతనాలు పెంచుతామని గొప్పలు చెప్పడమే తప్ప రూపాయి పెంచింది లేదన్నారు. మైనార్టీ సబ్‌ప్లాన్ అమలు ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ సరార్ కొత్త పథకాలు ప్రవేశ పెట్టుడు దేవుడెరుగు కానీ, కేసీఆర్ ఇచ్చిన పథకాలను సైతం బంద్ చేసిందని విమర్శించారు. తమ ప్రభు త్వం సిద్దిపేటలో సుమారు 700మంది నిరుపేద ముస్లింలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు. అండర్ గ్రౌండ్ నిర్మాణంతో ఇండ్ల ముందు మురుగు సమస్య తీరి, దోమలు, ఈగల బెడద తప్పిందన్నారు.
సిద్దిపేట విద్యాలయాలకు ఖిల్లాగా మారిందని, ప్రభుత్వ జనరల్ దవాఖానను వెయ్యి పడకలకు పెంచుకొని అన్ని సౌకర్యా లు కల్పించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్, నాయకులు పాల సాయిరామ్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వంగ తిరుమల్‌రెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.