Curtly Ambros : ప్రపంచ క్రికెట్లో రికార్డు బ్రేకర్ అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఆటకు సెల్యూట్ కొట్టనివాళ్లు ఉండరు. మైదానంలో దూకుడుగా కనిపించే విరాట్ ఆటతోనే కాకుండా ఫిట్నెస్తోనూ ఎందరికో ఆరాధ్యుడయ్యాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన కోహ్లీ ఆటంటే మాజీ క్రికెటర్లకు సైతం మస్త్ ఇష్టం. తాజాగా వెస్టిండీజ్ లెజెండ్ కర్ట్లీ అంబ్రోస్(Curtly Ambros) సైతం కోహ్లీపై అభిమానాన్ని చాటుకున్నాడు.
ఒకప్పటి విండీస్ అరవీర భయంకర బౌలర్లలో ఒకడైన అంబ్రోస్ తనకు కోహ్లీకి బౌలింగ్ చేయాలని ఉందని వెల్లడించాడు. వెస్టిండీస్ గొప్ప ఆటగాళ్లలో ఒకడైన అంబ్రోస్ ఈతరంలోని ముగ్గురికి బౌలింగ్ చేయాలని ఉందని చెప్పాడు. కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith), ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్(Joe Root)లకు బౌలింగ్ చేసేందుకు ఇష్టపడుతానని అంబ్రోస్ అన్నాడు. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన పేసర్ వసీం అక్రమ్ (Wasim Akram) అని అంబ్రోస్ తెలిపాడు.
రూట్, కోహ్లీ, స్మిత్
ఫ్యాబ్- 4 లో ఒకడైన విరాట్ నిరుడు 50వ వన్డే శతకంతో చరిత్ర సృష్టించాడు. అయితే.. టెస్టుల్లో మాత్రం జో రూట్ వరుస సెంచరీలతో దూసుకెళ్తున్నాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన లార్డ్స్ టెస్టు(Lords Test) రెండు ఇన్నింగ్స్‌ల్లో వంద కొట్టిన రూట్.. 34వ సారి మూడంకెల స్కోర్ సాధించాడు.
17 tons from 2012 to 2020.
17 tons since the start of 2021.Joe Root, there are no words 🤯 pic.twitter.com/8AQzpfk0FL
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2024
ప్రస్తుతం ఫ్యాబ్ 4లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్ మాజీ సారథి.. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డులకు ఎసరు పెడుతున్నాడు. మొత్తంగా అంతర్జాతీయ పరుగులను పరిశీలిస్తే కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ 26,942 రన్స్ బాదగా.. రూట్ 19,792.. స్మిత్ 16,225 పరుగులతో వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.