China : వెనెజువెలా అధ్యక్షుడు (Venezuela President) నికోలస్ మదురో (Nicolas Maduro) ను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై చైనా (China) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఏకపక్ష వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని అగ్రరాజ్యంపై మండిపడింది. ప్రపంచ పోలీస్లా, అంతర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించేందుకు ఏ దేశానికీ అధికారం లేదని పేర్కొంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అన్నారు. వెనెజువెలా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించిందని చెప్పారు. బలప్రయోగాన్ని చైనా ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఓ దేశం తమ ఇష్టాలను ఇంకో దేశంపై బలవంతంగా రుద్దకూడదని వ్యాఖ్యానించారు. ఏ దేశమైనా ప్రపంచ పోలీస్ పాత్రను పోషించలేదని పేర్కొన్నారు.
అంతర్జాతీయ న్యాయమూర్తినంటూ తమను తాము సమర్థించుకోడం సరికాదని వాంగ్ యీ అన్నారు. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమత్వాన్ని రక్షించాలని, అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా వెనెజువెలాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉందన్నారు.