Harish Rao | నాలో శక్తి ఉన్నంత వరకు సిద్దిపేట ప్రజల సేవలోనే ఉంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట విద్యాలయాలకు ఖిల్లాగా మారిందని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని వెయ్యి పడకలకు పెంచుకుని అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని.. ఇంకా చేసేది కూడా చాలా ఉందని అన్నారు.
సిద్దిపేట మిలాన్ గార్డెన్ లో సిద్దిపేట పౌండషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాల పంపిణి కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ఫౌండేషన్ అధినేత సాదాత్ నజీర్ ఫౌండేషన్ ను స్థాపించి నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని కొనియాడారు. కుల మతాలకతీతంగా పండుగలు వచ్చినప్పుడు నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగితే 13వేల ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్ అందేదని తెలిపారు. ఇమామ్, మోజోన్లకు జీతాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని అన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. నమాజుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య బోధనను అందించారని పేర్కొన్నారు. ఇందులో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేశామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను ఈ గురుకుల పాఠశాలలో అందించామని తెలిపారు. దీంతో ఇందులో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగానే కాకుండాఉన్నత స్థాయి స్థానాల్లో నిలుస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో అబద్ధపు హామీలను ఇచ్చిందని హరీశ్‌రావు అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే మేం అధికారంలోకి వచ్చాక లక్ష అరవై వేలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇమామ్, మోజోన్ల జీతాలు పెంచుతామని గొప్పలు చెప్పడమే తప్ప ఒక్క రూపాయి కూడా పెంచింది లేదని అన్నారు. రేవంత్ సర్కార్ కొత్త పథకాలు ప్రవేశ పెట్టలేదు కానీ కేసీఆర్ ఇచ్చిన పథకాలను సైతం బందు చేస్తున్నదని మండిపడ్డారు.