న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్సభ వర్షాకాల సమావేశాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేతృత్వంలోని యువజన నిరసనలకు సంబంధించిన మూడు సెట్ల ప్రశ్నలను నిలిపివేశారని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రశ్నలను తిరస్కరించారని ఆయన ఆరోపించారు. డీఎంకే లోక్సభ ఎంపీ మాతేశ్వరన్ వీఎస్ కేంద్ర హోం శాఖ, విద్యాశాఖలకు మూడు సెట్ల ప్రశ్నలను సమర్పించారు.
వీటిలో నీట్ యూజీ-2026 దరఖాస్తు ఫీజుల వాపసు, ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా అపనమ్మకం, ఢిల్లీలో సీజేపీ నిరసనకారులకు తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల నిరాకరణ, నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, విద్యార్థుల సంక్షేమం, ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా సంస్కరణలు , శాంతియుత నిరసన తెలిపే ప్రాథమిక హక్కును వినియోగించుకుంటున్న పౌరుల పట్ల అనుసరిస్తున్న తీరుపై సమాధానాలు కోరారు. లోక్సభ సభ్యుల పోర్టల్ ద్వారా ఈ ప్రశ్నలను తిరస్కరించినట్లు మాతేశ్వరన్ ధృవీకరించారు. నిబంధనల ప్రకారం ఇవి అంగీకార యోగ్యమైన ప్రశ్నలని, అయితే వాటిని తిరస్కరించడానికి వింతైన సమాధానాలు ఇచ్చారని సౌరభ్ దాస్ పేర్కొన్నారు.