ఆధునిక ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన జీవితచరిత్ర రచయితల్లో అమెరికన్ రచయిత, ప్రొఫెసర్ ‘వాల్టర్ ఐజాక్సన్’ ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల జీవితాలను లోతుగా అధ్యయనం చేసి, వారి వ్యక్తిత్వంలోని అనేక కోణాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఐజాక్సన్తో పోల్చదగిన తెలుగు రచయిత డా.కె.ముత్యం. ఆయన రచనా ప్రస్థానంలో అధిక భాగం జీవితచరిత్రలు, మరుగునపడిన చరిత్రలు, ప్రజా ఉద్యమాలు, సామాజికసాంస్కృతిక వ్యక్తిత్వాల అన్వేషణకు సంబంధించినవే కావడం ఇందుకు నిదర్శనం.
ప్రొఫెసర్ వాల్టర్ ఐజాక్సన్ రచించిన స్టీవ్ జాబ్స్, ఐన్స్టీన్: హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్, లియోనార్డో డావిన్సీ వంటి రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రాచుర్యం పొందాయో, డా.కె.ముత్యం రచించిన ‘నేను చిందుల ఎల్లమ్మను’, ‘సుబ్బారావు పాణిగ్రాహి’, ‘ప్రవహిస్తున్న జ్ఞాపకం’, ‘గంటి రాజేశ్వరరావు జీవితం’, ‘బంకుపల్లి మల్లయ్యశాస్త్రి జీవిత దృశ్యం’, ‘సోయం గంగులు’, ‘తెలంగాణ సాయుధ పోరాట వీరుడు మేర మల్లేశం’ వంటి రచనలు తెలుగు సాహిత్య రంగంలో అంతే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.
1958 ఏప్రిల్ 14న నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాచనపల్లిలో కోటూరు గంగారాం, భాగమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా ముత్యం జన్మించారు. ఆయన తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్, ఎంఈడీ, ఎల్ఎల్బీ అభ్యసించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్లో శిక్షణ పొందారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తొమ్మిదేండ్లపాటు పనిచేసి, ప్రతిష్టాత్మకమైన అనేక సెమినార్లను నిర్వహించారు.
వందలాది మంది విద్యార్థులను సాహిత్యాభిమానులు, రచయితలుగా తీర్చిదిద్దారు. యూజీసీ పరిశోధనలకు అందించే జేఆర్ఎఫ్ సాధించి పీహెచ్డీ కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ బయ్యా సూర్యనారాయణ, గుంటూరు త్రివిక్రమయ్యల పర్యవేక్షణలో ‘శ్రీకాకుళ ఉద్యమంసాహిత్యంపై దాని ప్రభావం’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో భాగంగా చేసిన క్షేత్ర పర్యటన ఆయనకు ఉత్తరాంధ్రతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరిచింది. అక్కడి వేలాది హృదయాలు ఆయనను తమ సొంత మనిషిగా ఆదరించాయి. శ్రీకాకుళ ఉద్యమం. ఆ ఉద్యమ నేపథ్యాన్ని, దాని ప్రభావంతో వెలువడిన సాహిత్యాన్ని ముత్యం లోతు గా అధ్యయనం చేసి వెలుగులోకి తెచ్చారు.
ఆయన సాహిత్య ప్రయాణంలో ప్రజా చైతన్య జీవితాలు, సామాజికసాంస్కృతిక పరిణామాలు, చారిత్రక ఘట్టాలు రచనల రూపంలో జీవం పోసుకొని మన ముందుకు వచ్చాయి. నిజామాబాద్ ప్రాంతంలోని గుట్టల కింద ఉన్న చిన్న పల్లె బాచనపల్లి. ఆ ప్రాంత చరిత్రను అన్వేషిస్తూ, బాచనపల్లిమానాల కొం డల మధ్య కోట నిర్మించి, గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి స్వంత సైన్యాన్ని, బలగాలను సమకూర్చుకున్న తెలంగాణ వీరు డు, చరిత్రలో మరుగునపడిన బల్గూరి కొండల రాయుడు (క్రీ.శ.171718) జీవిత విశేషాలను తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ తొలి కమ్యూనిస్టు వీరుల్లో ఒకరైన సర్వదేవభట్ల రామనాథం తనకున్న 1,500 ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచిపెట్టిన స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాన్ని గ్రంథస్థం చేశారు.
మాదిగల ఆశ్రిత కులంగా కొనసాగిన చిందు సమాజానికి చెందిన యక్షగాన కళాకారిణి చిందుల ఎల్లమ్మ. ఆమె జీవితం, కళా ప్రస్థానాన్ని ‘నేను చిందుల ఎల్లమ్మను’ పేరుతో ఆత్మకథ రూపంలో రాసి ఆమెకు విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టారు. స్వయంగా నాట్యాచార్య నటరాజ రామకృష్ణను పరిచయం చేసి ఎల్లమ్మ ప్రతిభకు పట్టాభిషేకం చేయించారు. ‘నేను చిందుల ఎల్లమ్మను’ గ్రంథాన్ని పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలలో పాఠ్యాంశంగా బోధించడం ఈ రచనకు లభించిన ప్రత్యేక గౌరవం.
‘తెలంగాణ శాస్ర్తాలు’ పేరుతో ఐదువేలకు పైగా సామెతలను సేకరించి ఎంతో శ్రమతో ముద్రణలోకి తెచ్చారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మడివాలయ్య అముద్రిత ‘శాయరీ రామాయణ శతకం’ను వెలుగులోకి తెచ్చి, తెలంగాణ ప్రాంతంలో ఒక నూతన చందస్సులో రామాయణం వెలువడిన విషయాన్ని తొలిసారిగా పరిచయం చేశారు.
డా.కె.ముత్యం శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిగా ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ భాష, సంప్రదాయాలపై సాంస్కృతిక దాడి జరుగుతున్న సందర్భంలో ఆయన నాలుగు జాతీయస్థాయి సెమినార్లను నిర్వహించారు. ఆ కృషి ఫలితంగా వెలువడిన ముఖ్యమైన గ్రంథాల్లో ‘ఉత్తర తెలంగాణ సంస్కృతి చరిత్ర’, ‘నేటి ప్రపంచీకరణలో తెలంగాణ భాష, తెలుగు భాష, గిరిజన భాషలుప్రామాణికత, అమలు, అస్తిత్వం’, ‘తెలంగాణలో అలభ్య శాసనాలు, గ్రంథాలు’, ‘ఉత్తర తెలంగాణ పల్లె సంస్కృతి’ వంటి గ్రంథాలు ఉన్నాయి. వీటితోపాటు ‘శాతవాహన పరిశోధక వ్యాసాలు’ వంటి విలువైన రచనలను తెలంగాణ సాహిత్యానికి పరిచయం చేశారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో డిగ్రీ తెలుగు పాఠాలను ‘జ్వాలాముఖి’ వంటి ప్రముఖులతో కలిసి దృశ్యరూపంలో రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘పాట’ పోషించిన పాత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటనలు నిర్వహించారు. పాట ప్రాముఖ్యతను వివిధ వేదికలపై వినిపించారు.
ఆయన జీవితం కేవలం ఒక రచయిత జీవితం కాదు. అది పరిశోధనకు ఒక మార్గం, ప్రజా చైతన్యానికి ఒక ఉద్యమం, తెలంగాణ అస్తిత్వానికి ఒక అన్వేషణ, మరుగునపడిన చరిత్రకు ఒక వెలుగు. శాస్త్రీయ పరిశోధన, రచన, సృజనాత్మకత, మానవత్వం, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఆయన తన రచనల ద్వారా మరుగునపడిన ఎన్నో జీవితాలు, ఉద్యమాలు, కళలు, చరిత్రకు అక్షరరూపం ఇచ్చారు. ఆయన చూపిన బాటలో నడువడం, ఆయన వెలికితీసిన చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేయడం, ఆయన సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే డా.కె.ముత్యంకు ముందు తరం అందించగల ఘనమైన నివాళి.