పనాజీ: భారతీయ కోస్టు గార్డుకు చెందిన సముద్ర ప్రతాప్(Samudra Pratap) నౌక ఇవాళ జలప్రవేశం చేసింది. గోవాలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. సముద్ర ప్రతాప్‌ను పొల్యూషన్ కంట్రోల్ వెసల్‌గా వర్ణిస్తున్నారు. ఈ నౌకను స్వదేశీయంగా తయారు చేశారు. నౌకా నిర్మాణం, మారిటైం సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ ఓ కీలక అడుగు వేసింది. సముద్ర ప్రతాప్ నౌకను గోవా షిప్‌యార్డు సంస్థ నిర్మించింది. సుమారు 60 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో సముద్ర ప్రతాప్‌ను తయారు చేశారు. ఇండియన్ కోస్టు గార్డు వద్ద ఉన్న నౌకల్లో సముద్ర ప్రతాప్ అతిపెద్ద నౌకగా గుర్తింపు తెచ్చుకున్నది.
మారిటైం పొల్యూషన్, ఫైర్ ఫైటింగ్, సముద్ర , పర్యావరణ రక్షణతో పాటు కోస్తా తీర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నది. మారిటైం సవాళ్లను ఎదుర్కొనే రీతిలో సముద్ర ప్రతాప్ యుద్ధనౌకను తయారు చేసినట్లు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే నౌకల్లో 90 శాతం స్వంత వస్తువులను వాడే రీతిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రాథమికంగా పొల్యూషన్ కంట్రోల్ కోసం దీన్ని డిజైన్ చేశామన్నారు. సముద్ర పర్యారవణ రక్షణ వ్యూహాత్మక అవసరమని, నైతిక బాధ్యత అని ఆయన అన్నారు.
అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్స్ సామర్థ్యం ఉన్న దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా అగ్రభాగాన నిలుస్తుందని మంత్రి అన్నారు. సముద్రాలు స్వచ్ఛంగా ఉంటే, వాణిజ్యం సురక్షితంగా సాగుతుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత, స్థిరమైన మారిటైం ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడుతున్నట్లు చెప్పారు. సుముద్ర ప్రతాప్ నౌక సుమారు 114.5 మీటర్ల పొడుగు ఉంటుంది.4200 టన్నులు బరువు ఉన్నది. సుమారు 22 నాట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.