Rice | బియ్యం మన ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఏళ్లుగా మనం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం. ప్రపంచ జనాభాలో 3/4 వంతు మంది బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. బియ్యాన్ని వండడం సులభంగా ఉండడంతో పాటు బియ్యంతో వండిన అన్నం సులభంగా జీర్ణమవుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు దీనిని సులభంగా జీర్ణించుకోగలుగుతారు. అలాగే అన్నంతో ఏ కూర కలిపి తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇతర ఆహారాలు లేని పూర్వకాలంలో అన్నాన్నే ఎక్కువగా తీసుకునే వారు. అయినప్పటికీ వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట అన్నం తినడం వల్ల శరీర బరువు పెరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు. సాయంత్రం సమయంలో జీవక్రియ మందగించి తిన్న ఆహారం కొవ్వుగా మారుతుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇది అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు.
రాత్రి పూట అన్నం తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు లేవని వారు తెలియజేస్తున్నారు. అన్నం తీసుకునే సమయం, దాని పరిమాణం అలాగే రోజంతా మనం తీసుకునే క్యాలరీల పైనే మన శరీర బరువు ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే క్యాలరీల కంటే మనం ఖర్చు చేసే క్యాలరీలు తక్కువగా ఉన్నప్పుడు శరీర బరువు పెరుగుతుంది. అలాగే మన శరీరం రాత్రి పూట కూడా పని చేయడం ఆగదు. రాత్రి నిద్రించే సమయంలో శరీరం నెమ్మదిస్తుంది. శ్వాస తీసుకోవడం, రక్తప్రసరణ, కండరాల మరమ్మత్తు వంటి ముఖ్యమైన పనుల కోసం క్యాలరీలను బర్న్ చేస్తూనే ఉంటుంది. నిద్రించే సమయంలో అనగా మనం రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలో మన శరీరంలో జీవక్రియ చురుకుగా ఉంటుందని అమెరికా జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జరిపిన పరిశోధనలల్లో వెల్లడైంది. రాత్రి మనం నిద్రించిన తరువాత కూడా మన శరీరం శక్తిని వినియోగించుకుంటుందని వెల్లడైంది.
కనుక రాత్రిపూట తీసుకునే అన్నం శరీర బరువు పెరగడానికి కారణం కానే కాదని మనం రోజంతా తీసుకునే క్యాలరీలే శరీర బరువు పెరగడానికి ముఖ్య కారణమని వారు చెబుతున్నారు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ బరువు పెరగడానికి కారణమే అయినప్పటికీ అన్నాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడే శరీర బరువు పెరుగుతుంది. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు అనే సమస్య తలెత్తుతుంది. అధిక క్యాలరీలు కలిగిన ఆహారంతో అన్నాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువు మరీ ఎక్కువగా పెరుగుతుంది. కనుక అన్నాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే కడుపు నిండడానికి ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే రాత్రి పూట పాలిష్ చేసిన బియ్యానికి బదులు రెడ్ రైస్, బ్రౌన్ రైస్ వంటి వాటిని తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర బరువు పెరగకుండా ఉంటుంది.
ఇక గ్లైసెమిక్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ మన ఆకలిని, కొవ్వు నిల్వలను బాగా ప్రభావితం చేస్తాయి. పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక తెల్ల బియ్యానికి బదులు బ్రౌన్ రైస్ వంటి వాటిని పప్పు దినుసులు, ప్రోటీన్ ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవాలి. అంతేకాకుండా అన్నంతో ఫ్రైడ్ రైస్, కొవ్వులు, చక్కెరలు కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. కనుక ఇంటి భోజనాన్ని తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్ రాత్రి నిద్రను మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మంచి నిద్రకు దారి తీస్తుంది. రాత్రి బాగా నిద్రించిన వ్యక్తులు మరుసటి రోజు ఆకలిని బాగా నియంత్రించుకుంటారు. కనుక సరైన పరిమాణంలో, సరైన ఆహారాలతో అన్నాన్ని కలిపి తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కనుక రాత్రిపూట అన్నాన్ని తీసుకున్నప్పటికీ తగిన మొత్తంలో సరైన ఆహారాలతో తీసుకోవడం మంచిదని తద్వారా శరీర బరువు కూడా పెరగకుండా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.