Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం వల్ల అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు మరియు నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా విడుదలలో జాప్యం జరుగుతోందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా స్పందిస్తూ ఈ రూమర్లకు చెక్ పెట్టారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో విడుదల చేసిన ఆయన, ‘కరుప్పు’ సినిమా ఎలాంటి సమస్యల్లో లేదని స్పష్టం చేశారు. సినిమా ఆలస్యం కావడం వల్ల అభిమానులు నిరాశ చెందుతున్నారని తనకు తెలుసని, అయితే వారి నిరీక్షణకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు.
గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై నిరంతరం పని చేస్తున్నామని, ప్రస్తుతం సినిమా పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇటీవల ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను ఆర్జే బాలాజీ ఖండించారు. “సినిమా ఏప్రిల్ 10న విడుదల కావడం లేదు. మరో పది రోజుల్లో అధికారికంగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అని ఆయన వెల్లడించారు.అలాగే నిర్మాతలతో లేదా సంగీత దర్శకుడితో విభేదాలు జరిగాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర బృందం మొత్తం ఎంతో ఐక్యంగా పనిచేస్తోందని, సినిమా అవుట్‌పుట్‌పై అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
అభిమానులు అనవసరమైన పుకార్లను నమ్మవద్దని కూడా సూచించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. ఇంద్రాన్స్, నట్టి, స్వాసిక, శివద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచింది. టీజర్లో సూర్య రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఒకవైపు వైట్ అండ్ వైట్ దుస్తుల్లో శరవణన్ అనే లాయర్ పాత్రలో కనిపిస్తే, మరోవైపు నలుపు దుస్తుల్లో చేతిలో కొడవలి పట్టుకుని ఊరమాస్ అవతార్‌లో కనిపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.