IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో కొత్త కుర్రాడు అరంగేట్రం చేయనున్నాడు. గాయపడిన వికెట్ కీపర్ వాన్ష్ బేడీ (Vansh Bedi) స్థానంలో ఉర్వల్ పటేల్ (Urval Patel)ను తీసుకుంది. టీ20ల్లో రికార్డు సెంచరీ కొట్టిన ఇతడు సీఎస్కే బ్యాటింగ్ యూనిట్లో కీలకం కానున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ చిచ్చరపిడుగు 28 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటికే ఆయుష్ మాత్రే చెన్నై జెర్సీతో ఇరగదీస్తున్నాడు. ఇప్పుడు ఉర్వల్ వచ్చేస్తుండడంతో ధోనీ సేనకు బ్యాటింగ్ కష్టాలే తీరినట్టేనని అంటున్నారు విశ్లేషకులు. పొట్టి ఫార్మాట్లో మెరుపు శతకం బాదిన 26 ఏళ్ల ఉర్వల్.. ఐపీఎల్లో రికార్డులు బద్ధలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
వాన్ష్ బేడీ, ఉర్వల్ పటేల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీతో ఉర్వల్ వార్తల్లో నిలిచాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్లో అతడు 170 స్ట్రయిక్ రేటుతో ఆడి 28 బంతుల్లోనే వంద కొట్టేశాడు. దాంతో, ఐపీఎల్ దృష్టిలో పడిన అతడిని 2023లో గుజరాత్ టైటాన్స్ కొన్నది. 18వ సీజన్లో టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సూపర్ కింగ్స్.. ఉర్వల్ను రూ.30 లక్షలకు తీసుకుంది.
పద్దెనిమిదో ఎడిషన్లో తీవ్రంగా నిరాశపరిచిన చెన్నై 11 మ్యాచుల్లో ఎనిమిదింటా ఓడిపోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో వైదొలిగాక పగ్గాలు అందుకున్న ధోనీ కూడా ఆ జట్టు రాతను మార్చలేకపోయాడు. చెన్నై తదుపరి కోల్కతా, రాజస్థాన్, గుజరాత్ జట్లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచుల్లో అయినా గెలుపొంది పరువు కాపాడుకోవాలని భావిస్తున్న సీఎస్కేకు ఉర్వల్ కొండంత అండ అవుతారా? లేదా? అనేది చూడాలి.