న్యాయవ్యవస్థపై దుమ్మెత్తి పోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన దుందుడుకు ప్రయత్నం బెడిసికొట్టింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో DD. ఈ వివాదాస్పద అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు చేపట్టి కేంద్రానికి తలంటు పోసింది. నిన్న గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనం దీని వెనుక ’లోతైన కుట్ర’ ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చిరు ప్రాయంలోని విద్యార్థుల మెదళ్లలోకి ఇలాంటి అపోహలతో కూడిన తప్పుడు అభిప్రాయాలను ఎక్కించడం శుద్ధ తప్పని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఉతికి ఆరేయడం గమనార్హం. కోర్టు కోపాగ్నిని చల్లార్చేందుకు ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. సొలిసిటర్ జనరల్ ద్వారా బేషరతు క్షమాపణలు చెప్పించింది. పుస్తకాల పంపిణీ ఆపేస్తామని హామీ ఇచ్చింది. అయినా కోర్టు శాంతించలేదు. ఆ పాఠమున్న పుస్తకాన్ని నిషేధించింది. ఏ రూపంలోనూ దానిని పంపిణీ చేయరాదని ఆదేశించింది. రెండు వారాల్లోగా ఈ ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని గడువు కూడా విధించింది. ఈ వ్యవహారాన్ని దేశం ముందుకు తేవడంలో మీడియా నిర్వహించిన పాత్రను ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.
ఇదేదో కింది స్థాయి వ్యక్తులు యథాలాపంగా చేసిన మామూలు పొరపాటు కానేకాదు. ఇదంతా పైనున్న ’పెద్దల’ ఆశీస్సులతో, వారి కనుసన్నల్లోనే జరిగిందనేది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను కేంద్ర పాలకులు ఇష్టారాజ్యంగా మారుస్తుండటం మొదటినుంచీ జరుగుతున్నది. పాఠ్యపుస్తకాల్లోని చరిత్రను తనకు నచ్చిన చట్రంలో ఇరికించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు గతంలో తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు న్యాయవ్యవస్థపై అవే పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవడం విస్మయం కలిగిస్తున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను ఒకటొకటిగా అదుపులోకి తెచ్చుకునేందుకు తదేక దీక్షగా ప్రయత్నిస్తూనే ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో ఆరితేరింది. ఎన్నికల సంఘాన్ని తన జేబుసంస్థగా మార్చుకొని ఆడిస్తున్నది. ఈ తరహా సొంత ఎజెండాలో భాగంగానే న్యాయవ్యవస్థపై నిరంతరం దాడి చేస్తున్నది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వంటి బీజేపీ కీలక నేతలు అప్పుడప్పుడు న్యాయవ్యవస్థపై కంటగింపు వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రాన్ని కాపాడుతూ వస్తున్న కొలీజియం వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని కేంద్రం గతంలో స్కెచ్ వేసింది. న్యాయ నియామకాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు ’కేంద్ర న్యాయ నియామకాల కమిషన్’ (ఎన్జాక్) చట్టాన్ని తెచ్చింది. దానిని సర్వోన్నత న్యాయస్థానం రద్దుచేసి, రాజకీయ జోక్యాన్ని ఆమడదూరానికి తరమడంతో బీజేపీ దూకుడుకు కళ్లెం పడింది. ఆ అమీతుమీ తర్వాత కూడా బీజేపీ నేతలు వంకర మాటలు మానలేదు. సుప్రీంకోర్టు తన విశేష అధికారాలను ’ఆటంబాంబుల్లా’ వినియోగించుకుంటున్నదని వ్యాఖ్యానించడం న్యాయవ్యవస్థ పట్ల వారి అయిష్టతను తేటపరుస్తున్నది.
ఆధునిక ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే గీటురాయి. ఆ రాజ్యాంగం అమలు బాధ్యత కార్యనిర్వాహక వర్గానిది, అంటే ప్రభుత్వానిది. అది సరిగా అమలవుతున్నదో లేదో ముల్లుగర్రతో పొడిచి గుర్తు చేయడం న్యాయవ్యవస్థ గురుతర బాధ్యత. ఈ బాధ్యత విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తన సత్తా చాటడం ఇటీవలే మనం చూశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధిస్తున్న సుంకాలు చెల్లవని తీర్పు చెప్పి రాజ్యాంగబద్ధ పాలనకు అండగా నిలిచింది. అత్యంత శక్తిమంతుడనే ఒక అగ్రరాజ్యం సర్వాధినేతను న్యాయవ్యవస్థ ఎలా దారికి తెచ్చిందనేందుకు ఇదొక ప్రబలమైన ఉదాహరణ. పాలకులు న్యాయవ్యవస్థను అడ్డంకిగా చూడటం ప్రపంచ చరిత్రలో కొత్తకాదు. వారి నిరంకుశ, ప్రజావ్యతిరేక విధానాలకు న్యాయవ్యవస్థ ముకుతాడు వేస్తుంది మరి. అందువల్ల బలమైన, స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన న్యాయవ్యవస్థ భారత ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని చెప్పక తప్పదు.