Moody’s survey : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తలు ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ (Rating Agency) మూడీస్ (Moody’s) హెచ్చరించింది. ఉద్రిక్తతలవల్ల భారత్‌తో పోల్చుకంటే పాకిస్థానే తీవ్రంగా నష్టపోతుందని తెలిపింది.
ఉద్రిక్తల కారణంగా పాకిస్థాన్ వృద్ధిరేటు మందగించడం, నిధుల సేకరణకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు లాంటివి తలెత్తుతాయని మూడీస్ పేర్కొంది. పాకిస్థాన్‌కు బాహ్య అప్పుల లభ్యత పరిమితమైపోవడంతోపాటు ఆ దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు కరిగిపోతాయని మూడీస్ హెచ్చరించింది. ఇప్పుడు విదేశీ అప్పుల చెల్లింపులకు అవి సరిపోని పరిస్థితి నెలకొన్నట్లు వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ ఐఎంఎఫ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
అదేవిధంగా భారత ఆర్థికవ్యవస్థ బలంగానే ఉంటుందని, స్థిరమైన వృద్ధిరేటును నమోదు చేస్తుందని మూడీస్ తెలిపింది. దీనికి తోడు నాణ్యమైన ప్రభుత్వ వ్యయాలు, ప్రజల వినిమయ శక్తి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటాయంది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావం అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. భారత ఆర్థిక కార్యకలాపాల్లో పెద్దగా ఇబ్బందులు ఉంటాయని అనుకోబోమని, ఎందుకంటే భారత్‌కు పాక్‌తో ఉన్న ఆర్థిక సంబంధాలు అతి తక్కువని, భారత్ మొత్తం ఎగుమతుల్లో ఇస్లామాబాద్‌కు వెళ్లేవి 0.5 శాతం మాత్రమేని మూడీస్ వెల్లడించింది.
‘ఇక మా జియోపొలిటికల్ అంచనా ప్రకారం భారత్-పాక్ మధ్య పరిమిత స్థాయిలోనే సైనిక ప్రతిస్పందనలు ఉండవచ్చు. ఇక సమయాన్ని బట్టి అప్పుడప్పుడు ఇవి ఎగసిపడవచ్చు. ఇరుదేశాలకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలానే జరుగుతోంది. అంతేకానీ విస్తృతస్థాయి సైనిక ఘర్షణకు ఇవి దారితీయవు’ అని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.