తాంసి : రసాయన ఎరువులు ( Fertilizers ) అధికంగా వాడితే అనర్థమేనని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి ( Sridhar Swamy) అన్నారు. సోమవారం మండలంలోని పొన్నారి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు అధికంగా వాడితే దిగుబడి తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. సాధారణంగా నేల స్వభావం, భూస్వారాన్ని బట్టి ఎరువులు వాడాలని, కానీ రైతులు ఒకే రకమైన ఎరువులు వినియోగిస్తున్నారని తెలిపారు. కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పంటలలో యూరియా వాడకం, రసాయనిక ఎరువులను తగ్గించాలని రైతులకు సూచించారు.
విత్తనాలు కొనుగొలు చేసేటప్పుడు రసీదును భద్రపర్చుకోవాలని, సాగు నీటిని ఆదా చేయాలని కోరారు. పంట మార్పిడి ని పాటించాలని, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్తవ్రేత్తలు కె రాజశేఖర్, జి మొహన్ దాస్, పోషాద్రి, సునీల్ కుమార్, జి శివచరణ్, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు రాజెందర్ రెడ్డి, ప్రవీన్, తాంసి డివిజన్ ఏడీఏ రవీందర్, మాజీ సర్పంచ్ అండె అశోక్, నాయకులు లింగారెడ్డి, మల్లయ్య ,ఆనంద్, రఘు, అనిల్ కుమార్, సాయినాథ్, రమణ, లక్ష్మీపతి, రైతులు పాల్గొన్నారు.