ENG vs PAK 1st Test : ఇంగ్లండ్ జట్టు రికార్డులు బద్దలు కొడుతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో బజ్‌బాల్ ఆటతో ప్రకంపనలు సృష్టించిన ఆ జట్టు ఇప్పుడు పాకిస్థాన్‌పై రికార్డు స్కోర్ కొట్టింది. యవకెరటం హ్యారీ బ్రూక్ (317) తొలి ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. మాజీ కెప్టెన్ జో రూట్(262) ద్విశతం బాదేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించాడు. దాంతో తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 823-7 వద్ద డిక్లేర్ చేసింది.
ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పరుగుల వరద పారుతోంది. పాకిస్థాన్, ఇంగ్లండ్ ఆటగాళ్లు పోటాపోటీగా సెంచరీలతో కదం తొక్కారు. తొలుత షాన్ మసూద్(151), అబ్దుల్లా షఫీక్(102), అఘా సల్మాన్(104)ల శతకమోతతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ సైతం దీటుగా బదులిచ్చింది.
England’s record Test partnership ✅
The fourth-highest of all time ✅That was something special 🤩 pic.twitter.com/6G0Bn4JK8A
— ESPNcricinfo (@ESPNcricinfo) October 10, 2024
మాజీ సారథి జో రూట్(262 : 375 బంతుల్లో 17 ఫోర్లు).. హ్యారీ బ్రూక్(317: 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు)లు విధ్వంసక ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లను ఉతికేశారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తూ.. రికార్డు స్కోర్ అందించారు. బ్రూక్ అయితే.. టెస్టుల్లో వేగవంతమైన రెండో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు.
సెహ్వాగ్, బ్రూక్
ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు ఆయువుపట్టులా మారిన బ్రూక్.. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తర్వాత తక్కువ బంతుల్లోనే ట్రిపుల్ కలను నిజం చేసుకున్నాడు. బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీకి చేరువ కాగా.. సెహ్వాగ్ 278 బంతుల్లోనే మూడొందలు కొట్టేశాడు. ఇద్దరూ కూడా ముల్తాన్లోనూ ఈ ఘనత సాధించడం విశేషం.
రూట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. పాక్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేసిన ఈ జోడీ 454 రన్స్ చేసింది. దాంతో, 2015లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు షాన్ మార్ష్, ఆడం వోజెస్లు పేరిట ఉన్న 419 పరుగుల రికార్డు బద్ధలైపోయింది. 823-7 వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన పాకిస్థాన్ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఇంకా పాక్ 244 పరుగులు వెనకబడి ఉంది.