Hyderabad | హైదరాబాద్‌లోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న ఓ వైన్‌షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపులో మద్యం బాటిళ్లు ఉండటంతో తొందరగానే షాపంతా వ్యాపించాయి.
వైన్‌షాపులో మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. వైన్ షాపులోని పాత వైరింగ్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. షాపు మూసివున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఈ ప్రమాదంలో షాపులోని మద్యం స్టాక్, ఫర్నీచర్ భారీగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నష్టం విలువ, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.