చండీగఢ్: పంజాబ్ ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బైన్స్ తెలిపారు. వ్యవస్థీకరించిన ‘హై-టెక్’ మోసమని ఆయన అన్నారు. హర్యానాలోని భివానీ నుంచి పనిచేస్తున్న ఒక నెట్వర్క్ ముఠాకు దీనితో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. (Punjab Exam Scam) ఇప్పటి వరకు 10 మంది ప్రధాన నిందితులను, 25 మంది అభ్యర్థులు, ఎనిమిది మంది హ్యాండ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వివరించారు. అరెస్టైన హ్యాండ్లర్లలో ఐదుగురు పంజాబ్‌కు, ముగ్గురు హర్యానా, రాజస్థాన్‌కు చెందినవారని వెల్లడించారు. నలుగురు అభ్యర్థులు, ఒక హ్యాండ్లర్ కోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు.
కాగా, హర్యానాలోని భివానీకి చెందిన ఈ నెట్వర్క్ ఒక స్థానిక శాఖను ఏర్పాటు చేసి పంజాబ్‌లోకి తన కార్యకలాపాలను విస్తరించిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నెట్వర్క్ గురించి ఒక కేఫ్‌లో రహస్య సమాచారం అందిన తర్వాత దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఫరీద్‌కోట్‌లోని నిందితుడు గుర్మీత్ సింగ్ నివాసాన్ని కంట్రోల్ రూమ్‌గా ఉపయోగిస్తున్నారని, అక్కడి నుంచి పలువురు హ్యాండ్లర్లు పనిచేయగా వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు.
మరోవైపు ఒక అభ్యర్థి ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి బయటకు పంపడానికి ప్రయత్నించగా, నిందితులు దీపక్, మంజిత్ జవాబులు అందించేందుకు సిద్ధమమయ్యారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ముఠా తమ ప్రణాళికను అమలు చేసేలోపు దానిని అడ్డుకున్నట్లు చెప్పారు. సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో రోల్ నంబర్ల జాబితాల ఆధారంగా పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. సోదాల సమయంలో మోసానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, హెడ్‌ఫోన్, ఆర్ఎఫ్ యాంటెన్నా, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.