BCCI : భారత పురుషుల జట్టు కొత్త హెడ్ కోచ్(Head Cocah) పదవిని చేపట్టేందుకు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) రెడీ అయిపోయాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానాన్ని గంభీర్ భర్తీ చేయనున్నాడు. కోచ్ పదవి కోసం మరెవరూ దరఖాస్తు చేయకపోవడంతో బీసీసీఐ గౌతీని ఇంటర్వ్యూ చేయనుంది. జూన్ 18 మంగళవారం నాడు ‘జూమ్’ కాల్ (Zoom Call)లో గంభీర్‌ను భారత క్రికెట్ సలహా కమిటీ ప్రశ్నించనుంది. ఈ ఇంటర్వ్యూ అనంతరం కోచ్‌గా గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
టీమిండియా ప్రధాన కోచ్ పదవిని స్వీకరించేందుకు గంభీర్ కొన్ని షరతులు పెట్టాడు. అందులో ఒకటి తనకు నచ్చిన సహాయక సిబ్బంది (Supporting Staff)ని తెచ్చుకునేందుకు అనుమతించాలని గంభీర్ పట్టు పట్టాడు. దాంతో, మొదట్లో తటపటాయించిన బీసీసీఐ పెద్దలు చివరకు అతడి అన్ని షరతులకు అంగీకరించారు. దాంతో, ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్(Jonty Rhodes) పేరు తెరపైకి రావడం చూశాం. గౌతీ, రోడ్స్.. ఇద్దరూ లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేండ్లు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే.
‘భారత జట్టు కోచ్‌గా ఉండాలని గంభీర్‌తో చర్చలు జరిపాం. టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తాడు’ అని బీసీసీఐ వర్గాలు ఇదివరకే తెలిపాయి. ఐపీఎల్(IPL)లో మెంటార్‌గా విజయవంతమైన గంభీర్ భారత జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయమనిపిస్తోంది. ముక్కుసూటి మనిషి అయిన గౌతీ నుంచి ముఖ్యంగా సీనియర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
రెండు ఐసీసీ ట్రోఫీ((2007 టీ20 కప్, 2011 వన్డే వరల్డ్ కప్)లు గెలిచిన భారత జట్టులో సభ్యుడైన గంభీర్ ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఏడు సీజన్లు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతీ.. లో కేకేఆర్‌ను రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌గా నిలిపాడు. ఈసారి మెంటార్‌గా సొంత గూటికి వచ్చీ రాగానే ట్రోఫీ సాధించిపెట్టాడు. అయితే.. ఫ్రాంచైజీ క్రికెట్ హిట్ ఫార్ములాతో భారత జట్టును చాంపియన్‌గా తీర్చిదిద్దాలని గౌతీ భావిస్తున్నాడు.