Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మల్లగుల్లాలు పడుతోంది. అయితే.. ఇరుదేశాలు తటస్థ వేదికపై ఆడేందుకు అంగీకరిస్తాయనే ఉద్దేశంతో ఏసీసీ షెడ్యూల్ విడుదలకు సిద్దమవుతోంది. జూలై రెండో వారంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహకాలు చేస్తోంది.
దాయాది దేశాల బోర్డులు తమ పట్టుసడలిస్తే సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను ప్రారంభించాలని మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ఏసీఏ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్ వేదికగా సెప్టెంబర్ రెండో వారం అంటే.. 10 వ తేదీన ఆసియా కప్ జరగాల్సి ఉంది. టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్లతో పాటు అఫ్గనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏయూలు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి.
కానీ.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. దాంతో, ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ (Hybrid Model)లో ఆడించాలని ఏసీఏ యోచిస్తోంది. తమ గడ్డపై ఆసియా కప్ మ్యాచ్‌ల నిర్వహణకు యూఏఈ సిద్ధంగా ఉంది. అయితే.. షెడ్యూల్ విడుదలయ్యాక బీసీసీఐ ఆలోచన ఏమైనా మారుతుందా? అనే ఏసీఏ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) చేపట్టింది. అంతేకాదు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని.. ఇకపై తమను ఒకే గ్రూప్‌లో ఉండకుండా చూడాలని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. దాంతో, అంతర్జాతీయ టోర్నీలో తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లో దాయాది దేశాల ఆట చూడడం ఇక అసాధ్యమే. దాంతో, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ వంటి టోర్నీల్లో భారత్, పాక్ తలపడితే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతతో ఉన్నారు.