Azharuddin : ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన భారత జట్టు సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా నెట్స్‌లో గంటలకొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు టీమిండియా క్రికెటర్లు. అయితే.. సిరీస్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌కు వర్క్‌లోడ్ కారణంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) అందుబాటులో ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు ఎక్కువగా బుమ్రాపై ఆధారపడుతోందని.. అలాకాకుండా బౌలర్లు సమిష్టిగా రాణించాలని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు.
‘భారత జట్టు బౌలింగ్ యూనిట్లో బుమ్రాపై అతిగా ఆధారపడుతోంది. ప్రతిసారి అతడు మెరుగైన ప్రదర్శన చేయలేడు కదా. పైగా ఇంగ్లండ్ పిచ్‌ల మీద అనుభవజ్ఞులైన బౌలర్లు ఉంటేనే వికెట్లు తీయగలం. అందుకే.. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలి. చైనామన్ బౌలర్ అయిన కుల్దీప్ వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. ఈమధ్య అతడు గొప్పగా రాణిస్తున్నాడు’ అని అజారుద్దీన్ తెలిపాడు. లీడ్స్ టెస్టులో అనూహ్య ఓటమిపై కూడా ఈ దిగ్గజ క్రికెటర్ స్పందించాడు.
‘బ్యాటింగ్ యూనిట్ ముఖ్యంగా లోయరార్డర్ వైఫల్యంతో ఓటమి ఎదురైంది. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేయాలంటే పక్కాగా సిద్దమవ్వాలి. వికెట్లు తీయగల బౌలర్లను తీసుకోవాలి. అప్పుడే సిరీస్ సమయం చేయగలుగుతాం. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ విషయానికొస్తే అతడికి ఇదే మొదటి సిరీస్. తొలి మ్యాచ్‌తోనే అతడి సారథ్యంపై అంచనాకు రాలేం. గిల్ ఈమధ్యే పగ్గాలు చేపట్టాడు కాబట్టి అతడికి కొంత సమయం ఇవ్వాలి. అతడిపై ఇప్పుడిప్పుడే విమర్శలు ఎక్కుపెట్టడం సరికాద’ని అజారుద్దీన్ అన్నాడు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు జూన్ 30న ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనుంది.