హనుమకొండ, జూన్ 29 : కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బత్తిని సదానందం అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసి జిల్లా ఆఫీస్ బేరర్స్సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూల నిర్ణయాలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు.
8 గంటల పని విధానం కాకుండా చూడడం, యజమాన్యం తమకి ఇష్టం వచ్చిన రీతిలో పనిగంటల విధానం తీసుకువచ్చే విధంగా చూడడం వంటి కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాలు అందక అప్పులు పాలై వెట్టిచాకిరి చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు పనిచేసే కేంద్రాలలో సామాజిక భద్రత కల్పించి కార్మికులందరికీ వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు రూ. 9000 పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 25 లక్షలు ఇవ్వాలని, కనీస వేతనాలు అందని కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు,గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్ ఇన్సూరెన్స్ ల సౌకర్యం అందించాలని డిమాండ్ చేసారు.
దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని, కనీస వేతన చట్టం అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్, రాజేష్ ఖన్నా, దుర్గా ప్రసాద్, అశోక్, రాస మల్ల కుమార్, గుంటి రాజేందర్, రాము, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.