చిట్యాల, జూన్ 29 : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన చిట్యాల మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు కథనం మేరకు.. చిట్యాల మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి (57) తన సోదరుడు నూతన గృహ నిర్మాణానికి ముగ్గు పోసుకుంటున్నాడని మరొక సోదరుడితో ద్విచక్ర వాహనం మీద తమ పుట్టినిల్లు అయినా రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి ఈనెల 27న బయలుదేరారు. కాగా, మార్గమధ్యమంలో తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనానికి పంది అడ్డురాగా సడన్ బ్రేక్ వేసినట్లు తెలిపారు.
దీంతో వెనకాల కూర్చున్న రాజమణి హఠాత్తుగా కింద పడడంతో తలకు తీవ్రమైన గాయాలు అయినట్లు చెప్పారు. గమనించిన స్థానికులు వెంటనే చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు అదే రోజు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఒకరోజు చికిత్స పొందిన అనంతరం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆదివారం తెల్లవారు జామున మార్గమధ్యమంలో మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. మృతురాలికి భర్త రవీందర్ ఉన్నాడు.