IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో మూడు ఫోర్లతో దూకుడు కొనసాగించిన యశస్వీ జైస్వాల్ (13) ఔటయ్యాడు. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన ఆర్చర్.. మూడో బంతికి ఓపెనర్‌ను డిఫెన్స్‌కు సిద్ధం చేశాడు. కానీ, బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ ఒడుపుగా అందుకున్నాడు. అంతే.. ఆర్చర్ తనదైన స్టయిల్లో సంబురాలు చేసుకున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్(1) జతగా కరుణ్ నాయర్ (2) ఆడుతున్నాడు. రెండు ఓవర్లకు టీమిండియా స్కోర్.. 16/1. ఇంకా గిల్ సేన 371 పరుగులు వెనకబడి ఉంది.
JOFRA IS BACK! 🔥pic.twitter.com/hfUSrAJtKn
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025
లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 251/4తో తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చూస్తుండగానే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీసిన స్పీడ్‌స్టర్.. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు.
ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే(56), వికెట్ కీపర్ జేమీ స్మిత్(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.
A superb five-for by India’s finest 🔥 pic.twitter.com/rqXlEukeFn
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025