IPL 2025 : టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవి కోల్పోయిన అభిషేక్ నాయర్(Abhishek Nair) మళ్లీ ఐపీఎల్లో భాగం కానున్నాడు. బీసీసీఐ అతడిపై వేటు వేయడంతో.. ఢిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) నాయర్‌ను గుండెలకు హత్తుకుంది. మళ్లీ అతడిని తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. శనివారం కోల్‌కతా ఫ్రాంచైజీ ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
‘గత సీజన్లో మా ఫ్రాంచైజీ సహాయక సిబ్బందిలో ఒకడైన అభిషేక్ నాయర్ మళ్లీ మాతో కలిశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ సెషన్లో ఉన్న జట్టుతో అతడు కలువనున్నాడు. ఇది నిజంగా మాకు గుడ్ న్యూస్’ అని కోల్‌కతా ఫ్రాంచైజీ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. నాయర్ రాకతో కోల్‌కతా బ్యాటింగ్, బౌలింగ్ మరింత రాటుదేలనుందని యాజమాన్యం సంబురపడుతోంది.
Welcome back home, @abhisheknayar1 💜 pic.twitter.com/IwJQTnAWxa
— KolkataKnightRiders (@KKRiders) April 19, 2025
ఐపీఎల్ 17వ సీజన్లో మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌తో కలిసి కోల్‌కతా మూడో ట్రోఫీ సాధించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను పసిగట్టడం.. వాళ్లకు తగిన విధంగా తర్పీదునివ్వడం అతడికి కొట్టినపిండి. దాంతో.. అభిషేక్ రాకను కోల్‌కతా ఫ్రాంచైజీ సహా, అభిమానులు స్వాగతిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రవిడ్ తర్వాత హెడ్‌కోచ్‌గా వచ్చిన గౌతం గంభీర్.. సొంత టీమ్‌లో అభిషేక్ నాయర్‌కు చోటు దక్కింది. అయితే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో.. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోర ప్రదర్శనతో సహాయక సిబ్బందిపై బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. పైగా సీనియర్ ఆటగాళ్లలో కొందరికి అభిషేక్‌తో సఖ్యత కుదరలేదు. దాంతో.. అతడితోపాటు ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్(T.Dilip)పై కూడా వేటు పడిన విషయం తెలిసిందే.