Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలోని నంది మేడారం రైతు వేదిక వద్ద శనివారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డీ వేణు తదితర అధికారులు పాల్గొనగా కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించి అమలులోకి తీసుకొని వచ్చారన్నారు. ఈ చట్టంలో అంశాలను రైతులకు చేర వేయాలనే రైతులకు అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. ఈ చట్టం ప్రకారం గ్రామంలో ప్రతీ సంవత్సరం సవరించిన భూ రికార్డులను ఎప్పటికప్పుడు హక్కు దారుల వివరాలను ప్రదర్శిస్తారని తెలిపారు. భూ హక్కులు ప్రజలకు అందే విధంగా ఈ చట్టం ప్రవేశం పెట్టామని అన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని చెప్పారు. భూ భారతి పోర్టల్ లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం రూ.2500 ఫీజు చెల్లించాలని, దరఖాస్తు తో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని, ఈ దరఖాస్తుల పై తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని, లేకుంటే గడువు తర్వాత ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందని చెప్పారు. భూమి హక్కు కలిగిన రైతులందరికీ రూ.300 రూపాయల ఫీజు తో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు.
భూ భారతి చట్టం పై అవగాహన కల్పించేలా కర పత్రాలను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. అనంతరం బంజేరుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారుల పులిపాక మల్లమ్మ కు లక్ష రూపాయలు చెక్కును ప్రభుత్వ విప్, కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, తహసీల్దార్ ఎండీ వకీల్, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు.