కట్టంగూర్, ఫిబ్రవరి 20 : గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం పెంపొందించుకుని పారదర్శకంగా పని చేయాలని సభ్యులకు సూచించారు. అనతరం వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయితీ అధికారి స్వరూపారాణి, మండల పరిషత్ పర్యవేక్షకులు చింతమల్ల చలపతి, టీఓటీలు వెంకన్న, మల్లేష్, నర్సింహ్మ, స్వామి, సైదులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.