బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై పిటిషన్ దాఖలు చేసి వాదించిన సామాజిక కార్యకర్త చిక్కుల్లో పడ్డాడు. స్నేహమయి కృష్ణను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. (activist arrested) అయితే ఆయన అరెస్ట్ కారణాలు తెలియలేదు. సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, కొంతమంది సహచరులు మైసూరులోని నివాస స్థలాల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు కృష్ణ ఆరోపించాడు. కేసారే గ్రామంలో వివాదాస్పద భూమికి బదులుగా పరిహార ప్లాట్లను పార్వతికి కేటాయించడం, ఆ భూమి హక్కు చట్టబద్ధతను అతడు ప్రశ్నించాడు. ఈ కేయింపుల వల్ల రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టం కలిగించిందని ఫిర్యాదు చేశాడు.
కాగా, కృష్ణ ఆరోపణలు, ఫిర్యాదులపై లోకాయుక్తతో పాటు పలు చట్టబద్ధ సంస్థలు దర్యాప్తు చేశాయి. అయితే లోకాయుక్త ఈ కేసును ముగించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక కోర్టును అతడు ఆశ్రయించాడు. ఈ ఏడాది జనవరిలో కృష్ణ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సిద్ధరామయ్య, ఇతరులపై దర్యాప్తు కొనసాగడానికి తగిన ఆధారాలు లేవన్న లోకాయుక్త తీర్పును సమర్థించింది.
మరోవైపు రిటైర్డ్ న్యాయమూర్తి పీఎన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ కూడా విధానపరమైన అవకతవకలకు కారణమైన కొంతమంది అధికారులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కర్ణాటక మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించింది. దీంతో సీఎం సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి లోకాయుక్త, కమిషన్ విచారణల నుంచి ఉపశమనం లభించింది.
అయినప్పటికీ సామాజిక కార్యకర్త కృష్ణ తన న్యాయ పోరాటాన్ని ఆపలేదు. ముడా కేసు విచారణలో లోకాయుక్త అధికారులు లంచం తీసుకున్నట్లు తాజాగా అతడు ఆరోపించాడు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ అదనపు సిటీ సివిల్, సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరుగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కృష్ణను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
Also Read:
Scrap Dealer Returns Gold | రూ.15 లక్షల విలువైన నగలు పొరపాటున పారవేత.. తిరిగి ఇచ్చిన స్క్రాప్ డీలర్
Man Kills Brother for Tea | టీ కోసం అన్నను నిద్ర లేపిన తమ్ముడు.. గొడవ జరుగడంతో అన్నను హత్య
Watch: బురఖా ధరించి లేడీస్ కోచ్‌లో ప్రయాణించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?