లక్నో: ఒక వ్యక్తి టీ కోసం అన్నను నిద్ర లేపాడు. అతడు ఆగ్రహించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఆ తర్వాత అన్న కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 10న ముసరిబ్ బేగ్ తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అతడు టీ తాగాలని భావించాడు. దీని కోసం నిద్రిస్తున్న అన్న తారిఖ్ బేగ్ గది తలుపు గట్టిగా తట్టాడు.
కాగా, నిద్రకు భంగం కలిగించిన తమ్ముడు ముసరిబ్పై అన్న తారిఖ్ అరిచాడు. దీంతో అన్నాదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన తమ్ముడు ముసరిబ్ గొడ్డలితో అన్న తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం ముసరిబ్ ఇంటి ఆవరణలో ఆరు అడుగుల లోతు గొయ్యి తవ్వాడు. అన్న మృతదేహాన్ని అందులో పాతిపెట్టాడు. ఆ చోటును ఇటుకలతో కప్పాడు. దానిపై కూలర్ ఉంచాడు.
మరోవైపు తన నేరాన్ని కప్పిపుచ్చేందుకు ముసరిబ్ ప్రయత్నించాడు. కొన్ని రోజుల తర్వాత అన్న తారిఖ్ కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ముసరిబ్ ప్రవర్తనపై మేనమామకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులకు అతడు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ముసరిబ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అన్నను చంపి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు అతడు అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. ఇంటి ఆవరణలో తవ్వి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం కోసం తరలించినట్లు చెప్పారు. ముసరిబ్ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Scrap Dealer Returns Gold | రూ.15 లక్షల విలువైన నగలు పొరపాటున పారవేత.. తిరిగి ఇచ్చిన స్క్రాప్ డీలర్
Watch: పాత్రలో ఇరుక్కున్న బాలుడి తల.. తర్వాత ఏం జరిగిందంటే?