Hyderabad | మెహిదీపట్నం ఏప్రిల్ 19 : వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలతో ఓ రౌడీ షీటర్‌ను హత్య చేయాలని వేసిన ప్లాన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి లంగర్‌హౌస్ పోలీసులు భగ్నం చేశారు. రౌడీ షీటర్ హత్యకు ప్రయత్నించిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి దగ్గరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక కారు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మెహిదీపట్నంలోని దక్షిణ పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్దికీ వివరాలను వెల్లడించారు.
నార్సింగికి చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ అష్రాఫ్ అలియాస్ అషు, అతని సోదరుడు ఇబ్రహీంతో కలిసి సెటిల్మెంట్లు చేస్తుంటారు. వీళ్లు లంగర్‌హౌస్, నానల్ నగర్ ఖాదర్ బాగ్, మెహిదీపట్నానికి చెందిన సయ్యద్ అఫ్రోజ్(37 ), మహమ్మద్ షా అవైస్(29), మహమ్మద్ అర్బాజ్ ఖాన్,(22), సయ్యద్ ఫిర్దోస్ (34)తో లకిసి భూ దందాలు చేశారు. అయితే కొంతకాలం కిందట వీరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి.
గోల్కొండ రౌడీ షీటర్ మహమ్మద్ పైల్వాన్, అతని మిత్రుడు అబును అషు 2020 జూన్‌లో దారుణంగా హత్య చేశాడు. దీంతో అష్రాఫ్‌పై అబు సోదరుడు సయ్యద్ ఇంతియాజ్ అలీ(45) పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అఫ్రోజ్, అవైస్, అర్బాజ్ ఖాన్, ఫిర్దోస్‌తో కలిసి అషును హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. వీరందరూ కలిసి జాబేర్, జమీల్ అలియాస్ జమ్మూ ల వద్ద రెండు దేశీ పిస్తోళ్లను కొనుగోలు చేశారు. అయితే రౌడీ షీటర్ అష్రాఫ్‌ను చంపడానికి పలువురు పథకం పన్నినట్లు లంగర్‌హౌస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఆదేశాలతో లంగర్‌హౌస్ పోలీసులు రంగంలోకి దిగిఈ ముఠాను పట్టుకున్నారు. వీరికి పిస్తోళ్లు అమ్మిన జాబేర్, జమీల్ పరారీలో ఉన్నారు.