సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 19: మహిళల భద్రత, రక్షణకు తెలంగాణ సర్కారు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో మరో అస్ర్తాన్ని చేర్చింది. వేధింపులకు గురవుతున్న మహిళలకు అండగా ఉంటూ అభయహస్తం అందించేందుకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కొత్తగా క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. షీటీమ్ రూపొందించిన క్యూఆర్ కోడ్ గోడపత్రికను పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళలు తమ భద్రత విషయంలో షీటీమ్‌కు మరింత సులభంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నూతనంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ కంప్లయింట్ పోస్టర్లను కమిషనరేట్ కార్యాలయం, మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జనరల్ దవాఖాన, సఖీ సెంటర్లలో, ప్రధాన కూడళ్లలో, బస్టాండ్, సినిమా థియేటర్లు, విద్యా సంస్థల ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు.
క్యూఆర్ కోడ్ వినియోగం ఇలా..
బాధిత మహిళలు షీటీమ్ బృందాలకు ఫిర్యాదు చేయదల్చినప్పుడు తమ స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ ద్వారా షీటీమ్ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్‌పై స్కాన్ చేయాల్సి ఉంటుంది. https://qr.tspolice.gov.in అనే వెబ్సైట్ అనుసంధానం అవుతుంది. ఈ సైట్‌లోని ఫారంలో బాధితుల పూర్తి వివరాలతో పాటు ప్రస్తుత లొకేషన్ పూరించి ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. కోడ్ స్కానింగ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌తో పాటు షీటీమ్, ఐటీ విభాగాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానంగా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే సంబంధిత షీటీమ్ విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు తక్షణమే సహాయం అందుతుంది. ఆకతాయిల నుంచి కానీ, వేధింపులకు గురవుతున్న మహిళలు క్యూఆర్ కోడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ వివరించారు. క్యూఆర్‌కోడ్ స్కానింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై భూలక్ష్మి, కానిస్టేబుల్ స్రవంతి, రజనీ, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…