ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 01, 2020 , 03:32:46

దోస్త్‌ పిలుస్తోంది..

దోస్త్‌ పిలుస్తోంది..

  • నేటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు 
  • జిల్లాలో 7 ప్రభుత్వ, 20 ప్రైవేటు కళాశాలలు 
  • కరోనా నేపథ్యంలో ప్రత్యేక యాప్‌ రూపకల్పన 
  • మూడు విడుతలుగా రిజిస్ట్రేషన్లు 

సిద్దిపేట టౌన్‌: ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. విశాలమైన గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అన్ని వసతులతో కూడిన బోధనను అందిస్తూ కార్పొరేట్‌ కళాశాలలను తలదన్నేలా మంచి ఫలితాలను రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థుల కోసం దోస్త్‌ పేరిట ఆన్‌లైన్‌ ప్రవేశాలకు మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4వ ఏడాది కొనసాగిస్తుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ ఏడాది ఉన్నత విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. జూలై 1 నుంచి ఆగస్టు 13 వరకు మూడు దశల్లో రిజిస్ట్రేషన్లను స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు తదితర అంశాలు ఇలా ఉన్నాయి. 

కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఉన్నత విద్యా మండలి ఒకరికొకరు ముట్టుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌ బదులు రియల్‌ టైమ్‌ డిజిటల్‌ రికగ్నైజేషన్‌ టీ యాప్‌ను రూపొందించింది. ఇంటర్‌ బోర్డు నుంచి పాసైన విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. విద్యార్థులు ఈయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబరు ఎంటర్‌ చేసి సెల్ఫీ ఫొటో ద్వారా దోస్త్‌ ఐడీని జనరేట్‌ చేసుకునే విధంగా రూపొందించింది. మొబైల్‌ ఫోన్‌కు ఆధార్‌ లింకు అయిన వారు నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌తో మొబైల్‌ లింకులేని వారు తల్లిదండ్రుల ఫోన్‌ నుంచి దోస్త్‌ హెల్ప్‌లైన్‌ లేదా మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. 

మూడు విడుతల్లో రిజిస్ట్రేషన్లు 

దోస్త్‌ రిజిస్ట్రేషన్లను మొదటి విడుత జూలై 1 నుంచి 14 వరకు ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. జూలై 6 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 22న సీట్లను కేటాయిస్తారు. జూలై 23 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూలై 23 నుంచి 29 వరకు రెండో విడుత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. జూలై 23 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. ఆగస్టు 7న రెండో దశ సీట్ల కెటాయింపు ఉంటుంది. 8 నుంచి 13 వరకు మూడో దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. 19న సీట్లు కేటాయిస్తారు. మొత్తం మూడు విడుతల్లో డిగ్రీ దోస్త్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ ఏడాది ఉన్నత విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. విద్యార్థులు నచ్చిన కోర్సును, నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం కల్పించింది. 

జిల్లాలో 7 ప్రభుత్వ, 20 ప్రైవేటు కళాశాలలు 

సిద్దిపేట జిల్లాలో 7 ప్రభుత్వ, 20 ప్రైవేటు కళాశాలలున్నాయి. సిద్దిపేట బాలుర డిగ్రీ కళాశాలలో 1500 సీట్లు, సిద్దిపేట మహిళా డిగ్రీ కళాశాలలో 300, గజ్వేల్‌ బాలుర కళాశాలలో 480, గజ్వేల్‌ బాలికల డిగ్రీ కళాశాలలో 660, హుస్నాబాద్‌ డిగ్రీ కళాశాలలో 360, దుబ్బాక కళాశాలలో 240, చేర్యాల కళాశాలలో 180 మొత్తం 3620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు కళాశాలలో 10 వేల వరకు ఉంటాయి. 

విద్యార్థుల సహాయార్థం హెల్ప్‌లైన్‌ కేంద్రాలు 

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్‌ హబ్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు ఈ కేంద్రాలు సిద్ధంగా ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులకు సూచనలు, సలహాలను ఇస్తూనే వారి సమస్యలను నివృత్తి చేస్తారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సెల్‌ నంబరు 9848574157, గజ్వేల్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ నంబరు 9966222110, 9440379380 సంప్రదించవచ్చు.


logo