New Year New Gadgets | మార్పు.. మార్పు.. మార్పు.. కాలం ఇచ్చిన తిరుగులేని తీర్పు. సృష్టిలో మార్పు మినహా మరేదీ శాశ్వతం కాదు. ఆ పరిణామక్రమమూ.. అనూహ్యమే! ఒక టెక్నాలజీ వస్తుంది. ఆశ్చర్యపోతాం. అంతకుమించిన టెక్నాలజీ వస్తుంది. మళ్లీ ఆశ్చర్యపోతాం. అంతలోనే మరొకటి. ఇదే ఆఖరు. దీనికి తిరుగులేదు.. అని తీర్మానించుకునేలోపు ఇంకో ఆవిష్కరణ. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినా తిరగకపోయినా.. టెక్నాలజీ చుట్టూ మాత్రం పొర్లుదండాలు వేస్తున్నది. ఈ ఏడాది ప్రయోగాల దశను దాటుకుని.. కొత్త ఏడాది మార్కెట్లో మాయాజాలం చేయడానికి వస్తున్న ఇరవైమూడు ఆవిష్కరణల పరిచయమే ఈ వ్యాసం.
అలా అని, ఇవే అత్యుత్తమమనీ చెప్పలేం. చెప్పినా అది చిలక జోస్యమే అవుతుంది. ఆరోగ్యం, వినోదం, భోజనం, ప్రయాణం, రక్షణ.. ప్రతి రంగంలోనూ సమీప భవిష్యత్తులో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని దండోరా వేయించి చెప్పేయవచ్చు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లోని యంత్ర పరికరాలన్నీ.. ఓ చిన్న బ్రేస్లెట్ రూపంలో రాబోతున్నాయి. మీ వాటర్ బాటిలే మీ మినరల్ వాటర్ ప్లాంట్‌గా మారబోతున్నది. వీగనిజం వేగంగా సౌందర్య రంగానికీ విస్తరించబోతున్నది. స్మార్ట్ హోమ్స్‌లోనూ రెండోతరం ప్రవేశించడం ఖాయమని తెలుస్తున్నది. ముద్దిచ్చే బొమ్మలు, ఆలింగనం చేసుకునే టెడ్డీలు ఒంటరితనాన్ని దూరం చేయబోతున్నాయి. గూగుల్ గూబ అదరగొట్టే సెర్చ్ ఇంజిన్ జెట్.. ఇంజిన్ స్పీడ్‌తో దూసుకొస్తున్నది. ఇంకా.. ఇంకా.. అనేకం, అపారం! ఆ సాంకేతికతను స్వాగతిస్తూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టండి. అన్నిటికంటే ముందు.. మార్పును ప్రేమించడం నేర్చుకోండి. కొత్తదనం అంటే బెదురు వద్దు. టెక్నాలజీని ద్వేషించే ప్రయత్నమే వద్దు. కాస్త పరిచయమైతే మీరే అలవాటుపడిపోతారు. ఆదమరిస్తే బానిసలూ అవుతారు. తస్మాత్ జాగ్రత్త!
సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ ప్రాధాన్యం తెలిసిందే. తాజాగా మరో వేదిక అవతరించింది. దానిపేరు యూ డాట్ కామ్. ఇతర సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా వరుసగా లింక్‌లు ఇవ్వటం కాకుండా వెబ్ ఫలితాలను కేటగిరీల ద్వారా విశ్లేషించి అందజేస్తుంది. అదీ కాకుండా ఇందులో స్పాన్సర్డ్ ప్రకటనలు ఉండవు. యూ డాట్ కామ్‌తో మరిన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఇక్కడ యాప్‌లు అంతర్గతంగా ఉంటాయి. సెర్చ్ పేజీ నుంచే నేరుగా మన పనులు పూర్తి చేసుకోవచ్చు.
హెయిర్ డ్రయ్యర్ల డిజైన్‌లో గత వందేండ్లుగా చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు. ఆ యంత్రాలు వేడిగాలిని కుదుళ్లలోకి ప్రసరింప చేస్తాయి. దీంతో జుట్టు ఊడిపోతుంది. కుదుళ్లు బలహీనంగా మారతాయి. ఇతర ఆరోగ్య సమస్యలూ రావచ్చు. అయితే జువీ హాలో సంస్థ కొత్తగా ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీని వినియోగిస్తూ కొత్త పరికరాన్ని మార్కెటోలోకి తెచ్చింది. నీటి ఆవిరి విధానాన్ని ఇందులో జొప్పించారు. ‘ఇన్ఫ్రారెడ్ లైట్ ఆధారంగా, మేం నేరుగా నీటిలోకి శక్తిని పంపిస్తాం. ఫలితంగా ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. సుమారు అరకిలో బరువు ఉండే ఈ పరికరం, తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది’ అంటూ ఆవిష్కరణ గురించి వివరిస్తారు జువీ ప్రధాన శాస్త్రవేత్త షియాహో జాంగ్.
చూడటానికి అచ్చం స్కేలులా కనిపిస్తుంది. కానీ వితింగ్స్ బాడీ స్కానర్‌లో బరువు, శరీర కూర్పు, గుండెవేగం, రక్తనాళాలకు సంబంధించిన పనితీరు మాత్రమే కాదు, అంతకుమించిన వివరాలూ లభిస్తాయి. ఇతర స్మార్ట్ స్కేళ్లలో మాదిరిగానే కొవ్వు, వాటర్ మాస్ కొలతలు తెలుసుకోవచ్చు. ప్రత్యేకమైన ఎలక్ట్రోడ్ సెన్సర్లతో కూడిన రిట్రాక్టబుల్ హ్యాండిల్ మరింత లోతుగా విశ్లేషిస్తుంది. కాళ్లు, చేతులు తదితర భాగాల పనితీరు తెలుసుకోవచ్చు. స్వేదగ్రంథులను ట్రాక్ చేస్తే మధుమేహం లాంటి వ్యాధులను ముందస్తు గానే గుర్తించడం సులభం. దీనికి అనుసంధానమైన ‘యాప్’ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ‘మేం మామూలు పరీక్షలను అధునాతన హోమ్ హెల్త్ చెకప్ స్థాయికి తీసుకెళ్తున్నాం’ అంటున్నారు వితింగ్ సీఈఓ మాథ్యూ లెతోంబె. ఎఫ్‌డీఏ అనుమతితో వితింగ్స్ బాడీ స్కానర్ కొత్త ఏడాది మార్కెట్ ప్రవేశానికి సిద్ధం అవుతున్నది.
భూమిమీదున్న నీటిలో 97 శాతం సముద్ర జలమే. ఈ నీటిని ఉపయోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఓ పరికరాన్ని ఈ- డైనా అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అపారంగా లభించే సముద్రపు నీటిని ఉపయోగించుకుంటుంది. సాగర జలాల్ని మెగ్నీషియంతో అనుసంధానించటం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. లైట్ల కోసం, చార్జింగ్కు వాడుకోవచ్చు. అరలీటరు ఉప్పునీటితో 45 రోజులపాటు విద్యుద్దీపం వెలిగేందుకు అవసరమైన కరెంటు పుడుతుంది. ఈ-డైనా ఇటీవల క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ చేపట్టింది. కొత్త ఏడాది లక్ష యూనిట్ల కరెంటు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వేలాది ప్రీ ఆర్డర్లను దక్కించుకుంది. మూడు పేటెంట్లను సొంతం చేసుకుంది. “ఇప్పటికి కూడా భూగోళం మీద కోట్లమంది ప్రజలు విద్యుత్తు సౌకర్యానికి నోచుకోవడం లేదు. చీకట్లోనే మగ్గుతున్నారు” అంటారు ఈ-డైనా వ్యవస్థాపకుల్లో ఒకరైన నికోలస్ పిన్జోన్ కార్బొడా. ఇకనుంచి ఆ ఇబ్బంది ఉండదు.
ఇప్పటివరకూ మేకప్ ప్రపంచం కార్మయిన్ మీద ఆధారపడి ఉండేది. దీనిని కీటకాల నుంచి రూపొందిస్తారు. కాబట్టి, వేగన్లకు ఎర్రటి పెదవులు కలగా మిగిలిపోయాయి. ఈ సమస్యకు యూనిలీవర్ ఆధ్వర్యంలోని వేగన్ కాస్మెటిక్స్ బ్రాండ్ హవర్ గ్లాస్ ఓ పరిష్కారం చూపింది. మూడేండ్ల పరిశోధన తర్వాత పెదవులకు ప్రకృతిసిద్ధమైన ఎరుపు రంగు అద్దడానికి ‘రెడ్ ఓ’ అనే వేగన్ లిప్‌స్టిక్‌ను తయారుచేసింది. శాటిన్ ఫినిష్‌తో అందంగా, నాజూకుగా ఉండే ఈ లిప్స్టిక్కు ఇంకా పేటెంట్ లభించలేదు. కొత్త ఏడాది ఈ లిప్‌స్టిక్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి హవర్ గ్లాస్ సంస్థ సిద్ధమవుతున్నది.
ఏటా ప్రపంచవ్యాప్తంగా యాభైవేల కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. అందులో 91 శాతం పునర్వినియోగానికి నోచుకోవటం లేదు. ప్లాస్టిక్ వాడని వాటర్ బాటిళ్లు నిస్సందేహంగా పర్యావరణానికి మంచి చేస్తాయి. కానీ నీళ్ల సంగతి ఏమిటి? ఈ సమస్యకూ పరిష్కారం లభించింది. ఇదిగో.. ఇది వాటర్ బాటిల్ కమ్ ఫిల్టర్. ఇక ఎక్కడికి వెళ్లినా నీళ్లు కొనాల్సిన పన్లేదు. మున్సిపల్ నల్లా నీళ్లు నింపుకొని హాయిగా గొంతు తడుపుకోవచ్చు. ఎల్ ఏ ఆర్ క్యూ బాటిల్ ఫిల్టర్లలో, పోర్టబుల్ వాటర్ బాటిళ్లలో ఏ నీళ్లు నింపుకొన్నా.. శుద్ధంగా మారిపోతాయి. ఆ నీళ్లలో పేరుకుపోయిన సీసం, ఇతర భారలోహాలను, పురుగుమందుల అవశేషాలను సైతం వదలగొడుతుంది.
ఫ్యాషన్ కొత్త రూపాలు సంతరించుకుంటున్న కొద్దీ పర్యావరణంపై ఎంతోకొంత దుష్ప్రభావం పడుతున్నది. దీంతో సరికొత్త మార్పులకు సిద్ధం అవుతున్నాయి ఫ్యాషన్ కంపెనీలు. ఈ క్రమంలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ నుంచి వస్ర్తాలు, పుట్టగొడుగుల నుంచి వేగన్ లెదర్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది ఆడిడాస్ కంపెనీ.. ఫిన్లాండ్ దేశానికి చెందిన స్పినోవా భాగస్వామ్యంతో సరికొత్త వస్ర్తానికి రూపకల్పన చేసింది. చెట్ల సెల్యులోజ్‌ను టెక్స్టైల్ ఫైబర్‌గా మార్చి దానితో కాటన్ తరహా వస్త్రమైన ‘స్పినోవా’ను రూపొందిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత సహజమైన, చాలా మన్నికైన ఫైబర్ ఇది’ అని తయారీ సంస్థ చెబుతున్నది. ‘కాటన్ తయారీతో పోలిస్తే, దీని ఉత్పత్తిలో 99 శాతం తక్కువ నీటిని వినియోగిస్తాం. అది కూడా పునరుత్పాదక ఇంధనంతో, ఎలాంటి రసాయనాల ప్రభావం లేకుండానే..’ అంటున్నది స్పినోవా. వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇంటర్నెట్ను మాల్వేర్ సమస్య చుట్టుముట్టింది. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవటం ఓ సవాలుగా మారింది. ఈ సంక్షోభానికి ఒక పరిష్కారం.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్). కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాల కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడకుండా ఈ వీపీఎన్ కాపాడుతుంది. డేటాను జాగ్రత్తగా నిక్షిప్తం (ఎన్‌క్రిప్ట్) చేస్తుంది. ఒకప్పుడు వీపీఎన్ కనెక్షన్లో వేగం తక్కువగా ఉండేది. నార్డ్ వీపీఎన్ అందుబాటులోకి రావడంతో ఆ సమస్యే ఉండదు. ఈ సరికొత్త వెర్షన్ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. దీనిని ఉపయోగించటం సులభం. మాల్వేర్ను, హానికరమైన ప్రకటనలను ఇది నిరోధిస్తుంది. ఇందులో ఎన్‌క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ మేనేజర్లు, క్లౌడ్ స్టోరేజి సదుపాయం ఉంటుంది. వీపీఎన్‌ను లిథువేనియా కేంద్రంగా పనిచేసే నార్డ్ సెక్యూరిటీ అభివృద్ధి చేసింది. దీని విలువ గత ఏడాది 160 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు.
ఈ మినీ మైక్రోస్కోప్ వేలికొస పరిమాణంలో.. కేవలం అరగ్రాము బరువు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లెన్స్‌కు సులువుగా జత చేసుకోవచ్చు. దీనిలో ఎంత చిన్న వస్తువైనా సరే.. అసలు రూపం కంటే 200 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. సూక్ష్మక్రిములు, చేతి గడియారాలలో ఉండే గేర్లను పరిశీలించడానికి ఈ మైక్రోస్కోప్ బాగా ఉపయోగపడుతుందని షాంఘై కేంద్రంగా పనిచేసే క్వింగ్ యింగ్ సంస్థ పేర్కొంది. ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు, సైన్సు విద్యార్థులు.. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత దగ్గరగా చూడటానికి ఈ మినీ మైక్రోస్కోప్ అవకాశం కల్పిస్తుంది.
తోటలు పెంచాలంటే నైపుణ్యం, ఓర్పు అవసరం. మీరు దక్షిణ కొరియాలో ఉంటే కనుక ఆ ఇబ్బంది ఉండదు. అక్కడ మొలకలు (స్ప్రౌట్స్) అనే అర్థం వచ్చే ఇండోర్ గార్డెనింగ్ సాధనం ఒకటి ఆవిష్కృతం అయ్యింది. దానిపేరు టీయున్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ దీన్ని తయారుచేసింది. చూడటానికి మినీ ఫ్రిజ్‌లా కనిపిస్తుంది. కానీ, వాస్తవానికి గ్రీన్ హౌజ్లా పనిచేస్తుంది. టీయున్ వాతావరణం నుంచి పోషకాలను స్వీకరిస్తుంది. మెరుపుల దెబ్బనూ తట్టుకుంటుంది. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నియంత్రించవచ్చు. టీయున్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ఏడాది ఇతర మార్కెట్లలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నామని ఎల్జీ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
పాడైపోయిన టాయ్‌లెట్ పైపు నుంచి రాలిపడే చుక్కలకొద్దీ నీళ్లతో నెలరోజుల్లో ఓ చిన్నపాటి చెరువును నింపేయవచ్చట. అందుకే గృహోపకరణాల తయారీ సంస్థ ఫిన్, ఇదే రంగానికి చెందిన మరో సంస్థ కొహ్లర్తో కలిసి హెచ్ 2 వైజ్ ప్లస్ అనే పరికరాన్ని రూపొందించింది. ఈ సాధనం పైపుల లీకేజీల విషయంలో ఇంటి యజమానులను అప్రమత్తం చేస్తుంది. నీటి వృథాను కట్టడి చేస్తుంది. ఇంట్లో ఉండే ముఖ్యమైన పైప్లైన్లలో ఈ పరికరాన్ని అమరుస్తారు. మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో వైజ్ ప్లస్ సెన్సర్లు పనిచేస్తాయి. ‘పైపుల పీడనంలో చోటు చేసుకునే 240 మార్పులను ఇది ఒక్క సెకనులో పసిగడుతుంది’ అంటారు ఫిన్ సీఈఓ రేయాన్ కిమ్. మనిషి మనుగడకు ఎంతో అవసరమైన నీరు వృథా కాకుండా వైజ్ ప్లస్ కాపాడుతుందని కిమ్ హామీ ఇస్తున్నారు.
ఆందోళనను దూరం చేసే బ్లాంకెట్ల తయారీలో ప్రసిద్ధిచెందిన మెరీనా ఖిడేకెలె సంస్థ కొత్తగా ‘హగీమల్స్’కు ప్రాణంపోసింది. ఇవి అచ్చు టెడ్డీ బేర్ బొమ్మల్లా కనిపిస్తాయి. సాధారణ టెడ్డీబేర్లను హత్తుకున్నప్పుడు అటువైపు నుంచి స్పందన ఉండదు. కానీ, ఈ బొమ్మలు.. స్పందిస్తాయి. దగ్గరికి తీసుకోగానే.. మనల్ని హత్తుకుంటాయి. దీంతో ఆత్మీయ అనుభూతి కలుగుతుంది. హగీమల్స్ తయారీలో థెరపిస్టులు, సైకాలజిస్టులు, పిడియాట్రిషియన్లు కూడా పాలుపంచుకున్నారు. టాయ్ ఫౌండేషన్ సహకారాన్నీ తీసుకున్నారు. తీవ్ర భావోద్వేగాలకు లోనైన చిన్నారుల కోసం వివిధ విద్యాసంస్థల నుంచి కూడా తమకు ఆర్డర్లు వస్తున్నాయని ఖిడేకెలె ప్రతినిధులు చెబుతున్నారు.
ఫిట్నెస్ ట్రాకర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నా, అందులో మహిళల శరీరాకృతిని అర్థం చేసుకుని రూపొందించినవి తక్కువ. ఈ పరిమితిని బెల్లాబీట్ ఐవీ వ్యవస్థాపకులు గుర్తించారు. దాంతో పూర్తిగా మహిళల అవసరాలను తీర్చేలా తొలి హెల్త్ ట్రాకర్‌ను రూపొందించారు. ఇది చూడటానికి అసలు సాంకేతిక ఉపకరణంలానే అనిపించదు. బ్రేస్లెట్లా ఉంటుంది. నెలసరి, ఫెర్టిలిటీ, మెనోపాజ్ మొదలైన కీలక అంశాలతోపాటు గుండెలయ, శరీరంలో నీటి శాతం (హైడ్రేషన్), నిద్ర తదితరాలనూ కనిపెడుతుంది. ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటి సమాచారం కూడా చెబుతుంది. దీని సాయంతో బరువు తగ్గటం లాంటి వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవచ్చు.
నాజూకుగా కనిపిస్తున్న ఈ హెల్మెట్ వినియోగదారుడికి భద్రతను, సౌకర్యాన్ని ఏకకాలంలో అందిస్తుంది. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే.. కేఏవీ స్పోర్ట్స్ ‘పోర్టోలా హెల్మెట్’ను రూపొందించింది. అమెరికా ప్రభుత్వం నిర్దేశించిన హెల్మెట్ రక్షణ ప్రమాణాలకు మించిన సాంకేతికతతో రూపొందించామని సంస్థ చెబుతున్నది. కస్టమైజ్డ్ 3డీ ప్రింటింగ్‌తో తయారైన ఈ హెల్మెట్ ధర 320 డాలర్లు. ‘ప్రజల ప్రాణాలను కాపాడాలనే మంచి ఆశయంతో సంస్థను ప్రారంభించాం. మా హెల్మెట్ చూడటానికి అందంగా ఉండటమే కాదు.. మీరు ధరించినప్పుడు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది’ అంటున్నారు కేఏవీ స్పోర్ట్స్ సీఈఓ విట్మన్ క్వాక్.
గోథెన్బర్గ్.. స్వీడన్లో ఒక నగరం. జియో ఫెన్సింగ్‌తో సురక్షితమైన రవాణా వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఆ నగర పాలక సంస్థ ఇటీవల వోల్వో వాహన తయారీ సంస్థతో జతకట్టి ప్రజా రవాణాను డిజిటల్‌గా నియంత్రించడానికి ఏర్పాట్లు చేసుకుంది. బడి పరిసరాలకు రాగానే బస్సుల వేగం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. కాలుష్యం మీద నిషేధం విధించిన ప్రదేశాలలో ప్రవేశించినప్పుడు, కర్బన ఉద్గారాలు విడుదల చేయకుండా.. విద్యుత్ శక్తిని వినియోగించుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్వీడన్లో అన్ని ప్రజా
రవాణా బస్సులలో జియో ఫెన్సింగ్‌ను అమలు చేసే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. ‘నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ గాయ పడకూడదు’ అంటారు గోథెన్బర్గ్ పట్టణ రవాణా మంత్రి సుజానె ఆండర్సన్.
కరోనా సమయంలో దాదాపు 2కోట్ల 30లక్షల మంది అమెరికన్లు తమ పెంపుడు కుక్కలు, పిల్లుల విషయంలో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలోనే జోస్పెక్టర్ అనే వ్యక్తి పెంపుడు జంతువుల సాధకబాధకాల గురించి ఆలోచించాడు. అందరికీ అందుబాటులో ఉండేలా ఏదైనా చేయాలని అనుకున్నాడు. ఫలితంగా, సబ్స్క్రిప్షన్ ఆధారిత టెలిమెడిసిన్ ప్లాట్ఫారం రూపొందించింది డచ్ అనే సంస్థ. ఇది పెట్ యజమానులను వైద్యులతో అనుసంధానం చేస్తుంది. అలర్జీలు, దద్దుర్లు, ఆందోళన లాంటి అత్యవసర చికిత్స అవసరం లేని వ్యాధులకు ఓ గంటలో వైద్యసేవలు అందే ఏర్పాటుచేస్తుంది. ఒకవేళ రక్త నమూనాలు, ల్యాబ్ పరీక్షలు అవసరమైనా కూడా డచ్ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. సమీపంలోని వైద్యుడే ఇంటికి వచ్చి అవసరమైన పరీక్షలు చేస్తాడు. ఈ సదుపాయం ప్రస్తుతం అమెరికాలోని 32 రాష్ర్టాలకే పరిమితం. కొత్త ఏడాది ప్రపంచమంతా అందుబాటులోకి రావచ్చు.
ప్రపంచంలోనే అతిపెద్దదైన.. 17.3 అంగుళాల తెరతో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ ఆసస్ కొత్తగా జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీని అభివృద్ధి చేసింది. ఈ జెన్ బుక్ కోసం అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడానికి ఆసస్ సంస్థ ఏండ్ల తరబడి కృషిచేసింది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే జెన్ బుక్ శ్రేణి ల్యాప్‌టాప్‌లు వెలువడ్డాయి. అయితే, ఈ జెన్ బుక్ 17 వాటికి భిన్నమైంది. దీన్ని పుస్తకంలా నిలువునా మడిచేలా రీడర్ మోడ్, తెరమీదే కీ బోర్డ్ ప్రత్యక్షమయ్యే ల్యాప్‌టాప్ మోడ్, ఏ టేబుల్ మీదో పెట్టుకుని పనిచేసే డెస్క్‌టాప్ మోడ్.. ఇలా వివిధ రకాలుగా వాడుకోవచ్చు. అయితే డెస్క్‌టాప్ మోడ్ కోసం మీరు జెన్ బుక్ 17 తెరను అడ్డంగా సాగదీయాల్సి ఉంటుంది. దీన్ని బ్లూటూత్ కీబోర్డుకు అనుసంధానం చేసుకోవచ్చు. కొత్త ఏడాది దీన్ని మార్కెట్లో విడుదల చేయనున్నారు.
అంధులైన చిన్నారులు తరగతి గదిలో బ్రెయిలీ లిపి ద్వారా పాఠాలు నేర్చుకుంటారు. కానీ వీరిలో చాలామందికి ఇంటి దగ్గర బ్రెయిలీ రీడర్ అందుబాటులో ఉండటం లేదు. అలాంటివాళ్ల అవసరాలను తీర్చటం కోసమే ఇప్పుడు పోలీ.. వైఫై ఆధారిత బ్రెయిలీ ఉపకరణం వచ్చింది. అమెరికన్ ప్రింటింగ్ హౌజ్ ఫర్ ద బ్లైండ్ థింకర్ బెల్ లర్నర్స్ దీనిని తయారుచేశాయి. ఇందులో ఆడియో సదుపాయం కూడా ఉంది. దీంతో ఉపాధ్యాయులు పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడినుంచైనా సరే వారు పిల్లలకు హోమ్‌వర్క్ ఇవ్వొచ్చు. పిల్లల సామర్థ్యాన్ని విశ్లేషించవచ్చు. సాధారణంగా బ్రెయిలీ రీడర్లను లోహం లేదా ప్లాస్టిక్‌తో చేస్తారు. ‘పోలీ’లో మాత్రం ఎలక్ట్రానిక్ బ్రెయిలీ స్లేట్.. స్టయిలస్ను మొట్టమొదటిసారిగా ఉపయోగించడం విశేషం.
రొమ్ముల నుంచి పాలను సీసాలో పట్టడం అంత సులువైన వ్యవహారం కాదు. దీనికోసం ఇప్పటివరకు ఉపయోగించిన యంత్రాలు బాలింత చను మొనలను గాయపరిచేవి. నిజానికి, గేదెల పాలు పితికే సాంకేతికతనే ఇక్కడా అన్వయించేవారు. ‘మొనలు, పొదుగూ ఒకటి కాదు. ఈ సున్నితమైన విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు’ అంటారు బేబియేషన్ ద పంప్ కంపెనీ సహ-వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) సమంతా రూడాల్ఫ్. దీనికి పరిష్కారంగా బేబియేషన్ సంస్థ పిల్లలు తల్లిపాలు తాగే విధానం నుంచి స్ఫూర్తిపొంది అధునాతన పంపును అభివృద్ధి చేసింది. దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు. ఈ యంత్రంలో మృదువుగా ఉండే సిలికాన్ బ్రెస్ట్ షీల్డ్స్, ట్యూబింగ్ వ్యవస్థ, శబ్దం చేయని మోటర్, సీసాలు ఉంటాయి. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కూలింగ్ ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ పంపింగ్ యంత్రాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. పంపింగ్ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు.
వినికిడి పరికరాలు వృద్ధులకు, చెవిటి వారికి మాత్రమే పరిమితం అనే అభిప్రాయం ఉంది. ఆ అపప్రథను దూరం చేసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే ఫిట్నెస్ ట్రాకర్లు, స్ట్రీమింగ్ సామర్థ్యం ఉన్న హియరింగ్ ఎయిడ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. హృదయ స్పందనలను సైతం గుర్తించేలా రూపొందిన వినికిడి పరికరాన్ని ఫోనక్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆడియో ఫిట్ వినికిడి పరికరం మనం ఎన్ని అడుగులు వేశాం, ఎంత చురుగ్గా ఉన్నాం, ఎంత దూరం నడిచాం అన్నదీ ట్రాక్ చేస్తుంది. అయితే ఈ సౌకర్యం కోసం మనం మైఫోనక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆడియో ఫిట్ వినికిడి జతలను స్మార్ట్ఫోన్లు, టీవీలు సహా బ్లూటూత్ సౌకర్యం ఉన్న ఎనిమిది పరికరాలతో అనుసంధానం చేసుకోవచ్చు.
3 డీ సినిమాలు చూడాలంటే ప్రత్యేకమైన కండ్లజోడు అవసరం. ఇప్పుడు అలాంటి అద్దాలు లేకుండానే 3 డీ చిత్రాలను చూసేందుకు ఏసర్‌కు చెందిన స్పేషియల్ ల్యాబ్స్ యూనిట్ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. లెంటిక్యులర్ టెక్నాలజీగా పిలిచే ఈ సాంకేతికతతో వాటికే ప్రత్యేకమైన విజువలైజేషన్ మెషిన్లను కలిగి ఉన్న ఏసర్ కాన్సెప్ట్ డీ 7 ల్యాప్‌టాప్ తెరలు.. 3 డీ చిత్రాలను అద్దాలు లేకుండానే చూసే వీలు కల్పిస్తున్నాయి. 3 డీ కంప్యూటర్ గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేర్‌లో అభివృద్ధి చేసిన మోడల్స్‌ను ఈ ల్యాప్‌టాప్ ఉపయోగించుకుంటుంది. 15.6 అంగుళాల తెర కలిగిన ఈ ల్యాప్‌టాప్‌లో 3 డీ చిత్రాలను చూడటానికి అద్దాల అవసరం అసలే ఉండదు. మన కండ్లు 3 డీ దృశ్యాలకు అనుగుణంగా మారడానికి కేవలం ఒక్క సెకను సరిపోతుందట.
కొత్త ఇంటికి రంగులేస్తాం. గోడలు వెలసిపోయినప్పుడు పాతింటికీ వన్నెలద్దుతాం. ఈ క్రమంలో ఎంతో రంగు వృథాగా మిగిలిపోతుంటుంది. అమెరికాలో ఇలా వృథా అయ్యే రంగుల వాటా ఏడాదికి 10 శాతం దాకా ఉంటుందని అంచనా. ఆ పెయింట్‌ను ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు. దీంతో పరిసరాలు కలుషితం అవుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి అప్ (యూపీ) పెయింట్ సంస్థ, పెయింట్ కేర్ అనే మరో లాభాపేక్ష లేని సంస్థతో కలిసి కొత్త ఆవిష్కరణ చేసింది. తమ ప్రణాళికలో భాగంగా ఈ సంస్థలు అమెరికాలోని 10 రాష్ర్టాల్లో వాడకుండా మిగిలిపోయిన పెయింట్లను అప్పగించేందుకు కొన్ని ప్రత్యేక స్థలాలతో ఒక వ్యవస్థను ఏర్పాటుచేశాయి. వీటికి అప్పగించిన పెయింట్లను అప్ సంస్థ సేకరించి, శుద్ధిచేసి మళ్లీ వాడుకునేందుకు వీలుగా అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలో వాడకుండా మిగిలిపోయిన పెయింట్‌లో 90 శాతం వరకు పునర్వినియోగానికి వస్తుండటం విశేషం. ఇలా ఇప్పటివరకు ఈ సంస్థ 18 విభిన్నమైన రంగులను అందుబాటులోకి తెచ్చింది. 2023లో మరిన్ని వర్ణాలు మార్కెట్లోకి రానున్నాయి.
స్మార్ట్ హోం గాడ్జెట్స్ వినియోగం పెరిగిపోయింది. చిన్న రిమోట్‌తో లైట్లు వేసుకుంటున్నాం. ఫ్యాన్లు ఆపేస్తున్నాం. ఏసీ పనిచేయిస్తున్నాం. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతలు మారుస్తున్నాం. మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారాన్ని వేడి చేసుకుంటున్నాం. కానీ, ఇక్కడో సమస్య ఉంది. ఆయా పరికరాలను రకరకాల కంపెనీల నుంచి కొనుగులు చేసి ఉంటాం. దీంతో వాటి అనుసంధానం కష్టమైపోతున్నది. కొన్నిసార్లు ప్రమాదాలకూ కారణం అవుతున్నది. అందుకే సాంకేతిక దిగ్గజ సంస్థలన్నీ కలిసి అత్యుత్తమ ప్రమాణాలతో థ్రెడ్ అనే టెక్నాలజీని రూపొందించాయి. ఇది వైర్లెస్ మెస్ నెట్వర్కింగ్ ప్రొటోకాల్. దీని ఆధారంగా వివిధ కంపెనీల గ్యాడ్జెట్లు మరింత సమర్థంగా అనుసంధానం అవుతాయి. అదీ తక్కువ విద్యుత్ వినియోగంతోనే! దీనివల్ల గ్యాడ్జెట్ల బ్యాటరీ జీవితకాలం కూడా మెరుగుపడుతుంది.
“Naya Mall | ఈ మిషన్‌తో నూనె లేకుండానే వేడి వేడి సమోసాలు, బజ్జీలు వేయించండి”
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”