ప్రపంచ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారిన వస్తువుల్లో ప్లాస్టిక్ ఒకటి. దీన్ని రీసైకిల్ చేయడం కుదరకపోవడంతో.. పర్వతాల్లా పేరుకుపోయి పర్యావరణానికి, మానవుల ఆరోగ్యానికి కూడా విపత్తు కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో ప్లాస్టిక్‌ను కరిగించి ఉపయోగకరమైన ఇంధనంగా మార్చే ప్రక్రియన ఐఐటీ మండి పరిశోధకులు తయారు చేశారు.
భవిష్యత్తులో పర్యావరణానికి హాని చేయని ఇంధనంగా హైడ్రోజన్‌ను శాస్త్రవేత్తలు చెప్తారు. ఇప్పుడు ఐఐటీ మండి పరిశోధకులు ప్లాస్టిక్‌ను కరిగించి హైడ్రోజన్ తయారు చేసే విధానాన్నే కనుగొన్నారు. విద్యాశాఖకు చెందిన స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ (స్పార్క్) పథకం కింద ఈ పరిశోధన చేసినట్లు తెలుస్తోంది.
దీని ఫలితాలను ఎన్విరాన్మెంటల్ కెమికల్ ఇంజినీరింగ్ జర్నల్‌లో ప్రచురించారు. ఐఐటీ మండి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ ప్రొఫెసర్ ప్రేమ్ ఫెక్సిల్ సిరిల్, అదే విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అదితి హాల్డర్, పీహెచ్డీ స్కాలర్లు రితుపార్న్ గొగోయి, ఆస్థా సింగ్, వేదశ్రీ మోతమ్, లలిత శర్మ, కాజల్ శర్మ కలిసి ఈ రీసెర్చ్‌లో పాలు పంచుకున్నారు.
‘‘ప్లాస్టిక్‌ను ఉపయోగపడే రసాయనాలుగా మార్చడమే మా ప్రాథమిక ఐడియా. కాలుష్య రహిత ఇంధనంగా దీన్ని చెప్తారు కాబట్టి, ప్లాస్టిక్ నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి అవడం చాలా ఉపయోగకరం’’ అని సిరిల్ తెలిపారు. ప్లాస్టిక్‌ను హైడ్రోజన్‌గా మారే ఒక క్యాటలిస్ట్ (ఉత్ప్రేరకాన్ని) ఈ పరిశోధకులు తయారు చేశారు. ఇది కాంతిలో పనిచేస్తే దాన్ని ఫొటోక్యాటలిస్ట్ అంటారు.
సాధారణంగా ఫొటోక్యాటలిస్టులు పనిచేయాలంటే అతినీలలోహిత (యూవీ) కిరణాలు కావాలి. కానీ ఐఐటీ మండి పరిశోధకులు తయారు చేసిన ఫొటోక్యాటలిస్ట్ మాత్రం సూర్యకాంతితోనే పనిచేస్తోందని సమాచారం. దీంతో సాధారణంగా ఆహారం, దుస్తులు, మెడిసిన్స్, కాస్మెటిక్స్ ప్యాక్ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వందశాతం హైడ్రోజన్‌గా మార్చడానికి వీలవుతుందని ఐఐటీ మండి పరిశోధకులు వెల్లడించారు.