Wobble One | భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించింది. ఇండ్కాల్ టెక్నాలజీస్ సంస్థ నూతనంగా వాబుల్ అనే స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే వాబుల్ వన్ పేరిట తన తొలి స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. వాబుల్ వన్ ఫోన్లో 6.67 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్‌ను అందిస్తుంది. కనుక డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది.
ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. గ్లాస్ బ్యాక్‌ను ఏర్పాటు చేశారు. కనుక ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా ఉంది. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. గూగుల్‌కు చెందిన ఏఐ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను, బ్లోట్ వేర్‌ను అందించడం లేదని, క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను 47 గంటల పాటు కాలింగ్‌కు, 24 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్కు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 22 రోజుల వరకు స్టాండ్ బై టైమ్‌ను అందిస్తుంది.
వాబుల్ వన్ స్మార్ట్ ఫోన్ ను 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
వాబుల్ వన్ స్మార్ట్ ఫోన్‌ను మైథిక్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్, ఆడిస్సీ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. అలాగే త్వరలోనే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్స్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌ను డిసెంబర్ 12వ తేదీ నుంచి అమెజాన్‌తోపాటు అన్ని రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్రయించనున్నారు.