హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు( Harish Rao) మూసి బ్యూటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) కి 8 సూటి ప్రశ్నలు ( Questions ) సంధించారు. వీటికి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటల్ లో మూసి బ్యూటిఫికేషన్‌పై ప్రెజంటేషన్ ఇస్తున్న సందర్భంగా మొదట తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు.
మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, మూసీ పేరిట రేవంతు చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే వ్యతిరేకమని ,సుందరీకరణ పేరిట వేలాది మందిని నిరాశ్రయులుగా చేస్తుండటానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మొదట మూసీ బ్యూటీఫికేషన్ కు శ్రీకారం చుట్టామని, రూ. 4వేల కోట్లతో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో పోసీ శుద్ది చేయాలనీ ప్రణాళికలు వేశామని వెల్లడించారు.
ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే తుగ్లన్ పాలన గుర్తుకు వస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ది పథంలో నడిపిస్తే.. రేవంతు తన తుగ్లక్ పాలనతో అధోగతి పాలు చేస్తున్నడని దుయ్యబట్టారు. . ఒకసారి మూసీ సుందరీకరణ అంటడు, మరోసారి మూసీ ప్రక్షాళన అంటడు, ఇంకోసారి మూసీ పునరుజ్జీవం అంటడు. పూటకో పేరు మార్చుతూ, రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ది ఉన్న వారెవరు మొదలు మొదలే పేదల ఇండ్ల మీద పడరు . వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలా చేస్తవు ? అంటూ నిలదీశారు. ఖజానా ఖాళీ అంటూనే, లక్షా 50వేల కోట్లకు టెండర్ పెట్టాడని విమర్శించారు. మూసీని బాగు చేయలనే చిత్తశుద్ది ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని, ఫైవ్ స్టార్ హోటల్లలో, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఏసీల్లో కూర్చొని కాగితాలు తిరగేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఎలాంటి డీపీఆర్ , ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, భయబ్రాంతులకు గురి చేయడం దారుణమని అన్నారు.
రేవంత్ రెడ్డికి 8 సూటి ప్రశ్నలు ?
1. అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు అధ్యయనం చేసి డీపీఆర్ ఇవ్వడానికి 18నెలలు పడుతుంది అన్నరు. మరి డీపీఆరే రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చారని, ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతమని గజిట్ ఎట్లా ఇచ్చినవు?
2. అసలు మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా? మూసీ ప్రక్షాళననా? అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు?
3. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు. ఉంటే స్టడీ బయట పెట్టండి? అసలు మూసి నుంచి ఎలా కొలుస్తారు?
4. ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేసారా? చేస్తే బయట పెట్టండి.
5. జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏడీబీ లోన్ 4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నది, మంజూరు అయ్యింది అని చెప్పారు. ఏడీబీ ఇప్పటికి డీపీఆర్ ఇవ్వలేదని, లోన్ సాంక్షన్ చేయలేదని మూడుసార్లు చెప్పిందనేది వాస్తవం. మరి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇలా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారు? పవిత్రమైన శాసనసభనే తప్పు తోవ పట్టించిండు రేవంత్ రెడ్డి? లోన్ మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించినవా స్పష్టం చేయి? లేదంటే అసెంబ్లీలో ప్రవిలేజ్ మోషన్ ఇస్తాం. అబద్దాలు మాట్లాడే రేవంత్ రెడ్డి శాపగ్రస్తుడు.
6. ఇప్పటికే చాదర్ ఘాట్ లో మూసీలో 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు పంపినవు. భూసేకరణ చట్టం ప్రకారం ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పండి? ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. నువ్వు చేస్తవని ప్రజలు ఎట్ల నమ్ముతారు? మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులు నిన్ను ఎట్ల నమ్ముతారు? మాట తప్పని నైజం కేసీఆర్‌ది.
7. మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా అన్నవు. సంతోషం. మధు రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నవు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? బ్యాంకుల్లో నిధులు జమ చేస్తవా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తవా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలి.
8.మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు, మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి. ఇవన్నీ కూల్చుతావా? నీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయండి.
మూసీ జన అందోళన్ బాధితులను హౌజ్ అరెస్టు ఎందుకు చేశారు? మూసీ పేరిట రేవంతు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బిజేపీ సహకరిస్తున్నదా? పేదల ఇండ్లు కూల్చడాన్ని సమర్థిస్తుందా? సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.