చెన్నై: తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ వీకే శశికళ(Sasikala).. కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మున్నేత్ర కజగం అని నామకరం చేశారు. ఏఐపీటీఎంఎంకే పేరును ఇవాళ ఆమె వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రామనాథపురం జిల్లాలోని కాముతి లో జరిగిన సమావేశంలో పార్టీ జెండాను శశికళ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొబ్బరిచెట్ల ఫార్మ్‌ను పార్టీ బొమ్మగా ప్రకటించారు.
ప్రస్తుతం శశికళ వయసు 71 ఏళ్లు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమ పార్టీ సింబల్ ఐక్యతకు సంకేతం అని ఆమె అన్నారు. తమ పార్టీ ఓ ఉమ్మడి కుటుంబం తరహాలో పనిచేస్తుందన్నారు. తమిళనాడు, పుదుచ్చరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీచేయనున్నట్లు ఆమె చెప్పారు. మన నాయకుడు ఎంజీ రామచంద్రన్ ఎదుర్కొన్న దశలోనే తాను కూడా ఉన్నానని, క్యాడర్ ప్రారంభించిన పార్టీలోనే ఆయన చేరారని ఆమె అన్నారు. తమ పార్టీ జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉన్నాయన్నారు. ఆ జెండాలో మాజీ సీఎంలు సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఫోటోలు కూడా ఉన్నాయి.