Snapchat | సామాజిక మాధ్యమాల్లో కొత్త విప్లవం స్నాప్‌చాట్. అదిరిపోయే ఫీచర్స్‌తో యువతను అమితంగా ఆకట్టుకున్నది ఈ మెసేజింగ్ యాప్. గేమ్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్, ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ ఇలా రకరకాల ఆప్షన్లు ఈ మెసేజింగ్ యాప్‌ను యువతకు మరింత చేరువ చేశాయి. ఈ ఫీచర్స్‌నే వాడుకుంటూ స్నాప్‌చాట్ మాటున చేటు చేస్తున్నారు కేటుగాళ్లు. యువతను టార్గెట్ చేస్తూ వారి భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
మన బలహీనతే ఆన్లైన్లో స్కామర్లకు బలం. ఆదమరచి ఉన్నట్టు అనుమానం వస్తే చాలు ఉచ్చులో చిక్కుకునేలా చేస్తారు. సామాజిక మాధ్యమాలపై కన్నేసిన వెబ్ దుండగులు అధునాతన ఫీచర్లు కలిగిన స్నాప్‌చాట్‌ను ఇప్పుడు సైబర్ నేరాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. అకౌంట్ హ్యాకింగ్, లైంగిక వేధింపులు, వ్యక్తిగత సమాచార తస్కరణ లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రైవసీ సెట్టింగ్స్‌లో చిన్నపాటి తప్పున్నా సరే ఆన్లైన్లోనే వెతికి పట్టుకొని వెతలపాలు చేస్తున్నారు. మన యాక్టివిటీస్ ఆధారంగా వల పన్ని విలవిల్లాడేలా చేస్తారు.
☞ స్నాప్‌చాట్ ప్లాట్ఫామ్లో కేవలం మన స్నేహితులు మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటు. వర్చువల్‌గా మనల్ని పసిగట్టి దెబ్బతీసే వాళ్లకు కొదవ లేదు. ఫిషింగ్, కీ లాగింగ్ అటాక్స్ ద్వారా అనధికారికంగా మన అకౌంట్ యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేస్తారు. కక్ష పూరితమైన సందేశాలు పంపుతుంటారు. వ్యక్తిత్వ హననానికి పూనుకుంటారు.
☞ అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో ఉన్నట్టుగానే వివిధ ఆకర్షణలు ఇక్కడా ఉంటాయి. నమ్మించి నట్టేట ముంచే వ్యక్తులూ తారసపడతారు. కవ్వింపు మాటలతో బుట్టలో వేసుకుంటారు. ఆ మాటలు నమ్మి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు షేర్ చేసుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తారు. చాట్, వీడియోకాల్ రికార్డులు అడ్డుపెట్టుకొని డబ్బులు డిమాండ్ చేస్తారు.
☞ స్నాప్‌చాట్ సైబర్ బుల్లీయింగ్‌కు అతీతం కాదు. నూతన సాంకేతికతను జోడించుకున్న దీని వేదికగా మంచిని ఎంత త్వరగా ప్రచారం చేయగలమో, చెడునూ అంతే వేగంగా విస్తరించవచ్చు.
☞ క్యాస్ట్ఫిషింగ్ ద్వారా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
☞ మెసేజ్ డిసప్పియర్ ఆప్షన్ ఉంది కదా! అని ధైర్యంగా మెసేజ్‌లు చేస్తుంటాం. కానీ, అది అన్నిసార్లూ శ్రేయస్కరం కాదు. థర్డ్‌పార్టీ అప్లికేషన్ల ద్వారా డిసప్పియర్ అయిందనుకున్న సందేశాలను సంగ్రహించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు దాపురించవచ్చు.
☞ స్నాప్మ్యాప్ ద్వారా మనం ఎక్కడున్నది అవతలి వారు తెలుసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఆప్షన్‌ను సవరించుకోవచ్చు. ఆ ఆప్షన్‌ను మీ దగ్గరి వారికి పరిమితం చేయొచ్చు.
☞ స్నాప్‌చాట్‌లో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తులను మాత్రమే యాడ్ చేయడం శ్రేయస్కరం. పేరు నచ్చో, స్టేటస్లు మెచ్చో ముక్కూమొహం తెలియని వ్యక్తులకు సందేశాలు పంపొద్దు.
☞ ఎంత తెలిసిన వారికైనా వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన అంశాలు, శృంగారభరిత సందేశాలు పంపడం ఎప్పటికైనా ముప్పే. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు అస్సలు షేర్ చేయొద్దు.
☞ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు.
☞ స్నాప్‌చాట్ ద్వారా దగ్గరైన వ్యక్తిని కలవాల్సి వస్తే రహస్య ప్రదేశంలో కాకుండా పబ్లిక్ ప్లేస్‌లో కలవండి. ఫలానా వ్యక్తిని కలుస్తున్నట్టు మీ దగ్గరివారికి ముందస్తుగా సమాచారం ఇవ్వండి. వీలైతే మరోవ్యక్తిని మీకు తోడుగా తీసుకెళ్లడం మంచిది.
☞ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకండి. ఒకవేళ లింక్ క్లిక్ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు షేర్ చేయకండి. స్నాప్‌చాట్ గానీ, ఇతర ఆథరైజ్డ్ యాప్‌లు గానీ అధికారిక ధ్రువపత్రాలు షేర్ చేయమని గానీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిందిగా గానీ కోరదు అని గుర్తుంచుకోండి.
☞ స్నాప్‌చాట్ యాప్‌ను ఎప్పటికప్పుడు ప్లేస్టోర్ ద్వారా అప్డేట్ చేసుకోండి. అప్డేటెడ్ వెర్షన్ అప్డేషన్ ద్వారా భద్రత పెరుగుతుంది. గతంలో ఏమైనా బగ్స్ ఉన్నా అవి తొలగిపోతాయి. తాత్కాలికంగానే అయినా ఏ ఇబ్బందీ ఉండదు.
☞ స్నాప్మ్యాప్లో సెట్టింగ్స్ పక్కాగా ఉండేలా చూసుకోండి. అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవడం మంచిది.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Cyber Crime Preventation Tips | సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారా? వెంటనే ఈ పనులు చేయండి!
Cinema Review | సినిమా రివ్యూలు ఇవ్వండి.. డబ్బులు ఇస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?
Tech Tips | సోషల్‌మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి