Cinema Review | ఒకప్పుడు సినిమా విడుదలైందంటే మొదటి ఆట తర్వాత ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తూ ఉండేవారు సినీజనాలు. ఎన్ని ప్రచారాలు చేసినా ప్రేక్షకుడు పెదవి విరిస్తే ఫ్లాప్! వాళ్లకు నచ్చిందా.. హిట్!! కానీ, ఇప్పుడు సినిమా జయాపజయాలను రివ్యూలు డిసైడ్ చేస్తున్నాయి. సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది అంటూనే సినిమాతో చెడుగుడు ఆడుకుంటున్నారు రివ్యూయర్లు. టైటిల్స్ మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడేవరకూ లైవ్ రివ్యూ పేరుతో కథ, కథనాలను పూసగుచ్చినట్టు ముందే చెప్పేస్తున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్లు సినిమా సమీక్షల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు
సినిమాలకు రివ్యూలు ఇవ్వడం కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే! ఒకప్పుడు సినిమా విడుదలయ్యాక రెండు వారాలకు పత్రికల్లో విశ్లేషణాత్మక సమీక్షలు వచ్చేవి. అప్పటికే ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీతో సినిమా జయాపజయాలు నిశ్చయమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. సామాజిక మాధ్యమాల్లో పుట్టుకొస్తున్న సమీక్షలు వీక్షకులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బెనిఫిట్ షోలు, ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే విడుదల కావడంతో సాధారణ విడుదలకు ముందే రివ్యూలతో ఆ చిత్రంపై ప్రేక్షకులకు ముందస్తు అంచనాలు ఏర్పడేలా చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారాలన్నీ ధర్మబద్ధంగా సాగితే ఏ ఇబ్బందీ ఉండదు. సాంకేతికతను అడ్డం పెట్టుకొని నిమిషానికో అప్డేట్ చొప్పున, ప్రతి సన్నివేశానికీ లైవ్‌లో భాష్యం చెబుతూ సినిమా ఊపిరి తీసేస్తున్నారు ఫ్రాడ్ రివ్యూయర్లు!
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి, ఫలానా సినిమాను పనిగట్టుకొని బద్నామ్ చేయడానికి సోషల్ మీడియా రివ్యూలను పావుగా వాడుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రకరకాల రివ్యూలు రాజ్యమేలుతున్నాయి.
పెయిడ్ రివ్యూలు: తమ సినిమా అంతంత మాత్రమే ఉన్నా.. పాజిటివ్ పబ్లిసిటీ వచ్చేలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను వాడుకుంటున్నారు కొందరు. పోటీగా విడుదలైన సినిమాపై వ్యతిరేక సమీక్షలు రాయిస్తూ, ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తుంటారు.
మోసపూరిత రివ్యూలు: ‘ఫలానా సినిమా ఎలా ఉంది?’ అని ఓటింగ్ అడగటం సాధారణంగా చూస్తుంటాం. ఇక్కడా పారదర్శకత కనిపించదు! ఇలాంటి సందర్భాల్లో ఫేక్ అకౌంట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా వాళ్లకు కావాల్సిన దానికి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండేలా చూస్తారు.
అనుమానం రాకుండా: ఫేక్ అకౌంట్ల ద్వారా విషపు రివ్యూలూ చిమ్ముతూ ఉంటారు. అదే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని అనుకూల సమీక్షలు కూడా పంపుతూ ఉంటారు.
అందరినీ ఒప్పించేలా: ఒక సినిమాపై ప్రేక్షకుల్లో స్థిరమైన అభిప్రాయం ఏర్పడేలా ఫేక్ అకౌంట్లు, వ్యక్తుల ద్వారా ఒకే విధమైన రివ్యూలు (కామెంట్లు) పెట్టిస్తారు.
ఉద్దేశపూర్వకంగా: వ్యక్తిగతంగా ఒకరిని దెబ్బతీయడమే లక్ష్యంగా నెగెటివ్ రివ్యూలు రాయిస్తుంటారు.
Cinema Review Ratings1
☞ రివ్యూ ఓటింగ్ కోసం వాట్సాప్‌లో, ఫేస్బుక్లో సందేశాలు పంపుతుంటారు. ఓటింగ్‌లో పాల్గొనండి, ఆదాయం పొందండి అంటూ వల వేస్తారు.
☞ టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరాలని చెబుతారు. అలా చేరిన వారిని ఫేక్ రివ్యూలు, ఓటింగ్ చేయమని చెబుతారు. ఎంతోకొంత వస్తుంది కదా అని వాళ్లూ చెప్పినట్లే చేస్తారు.
☞ ఇంతవరకు బాగానే ఉన్నా.. తాము రేటింగ్ ఇవ్వడానికి ముందే సినిమా చూస్తే రూ.2,500 నుంచి రూ.5,000 వరకు కమీషన్, బోనస్ ఇస్తామని చెబుతారు. ఇప్పటికే ఇలాంటి కమీషన్లు చాలాసార్లు తమకు వచ్చాయంటూ మరికొందరు మెసేజ్ షేర్ చేస్తుంటారు. ఇది నిజమని నమ్మి సినిమా చూసి రివ్యూలు రాసేస్తుంటారు బాధితులు. బోనస్ మొత్తం వాళ్ల వాలెట్ అకౌంట్లో కనిపిస్తుంది కానీ, దానిని వాళ్లు విత్‌డ్రా చేసుకోలేరు.
☞ ఇక్కడితో ఆగిపోతే నష్టం లేదు. కానీ, వాలెట్లో కనిపిస్తున్నంత మొత్తం అందులో జమ చేస్తే పూర్తి మొత్తం వాడుకోవచ్చని నమ్మబలుకుతారు. నిజమేనేమో అని సొంత డబ్బులను వాలెట్లో జమ చేస్తారు. తర్వాత అవి కూడా తీసుకునే వీలు ఉండదు. బాధితులు తాము మోసపోయామని గుర్తించే వరకు మరింత జమ చేయాల్సిందిగా చెబుతూనే ఉంటారు.
☞ ఎలాంటి శ్రమా లేకుండా ఎవరో అప్పనంగా డబ్బులు ఇస్తామంటే నమ్మడం పొరపాటు. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఇలాంటి ఆఫర్లు వస్తే పట్టించుకోకపోవడం మంచిది.
☞ ఈ తరహా ఆఫర్లు వస్తే, సదరు వెబ్సైట్ విశ్వసనీయతను ముందుగా తెలుసుకోవాలి.
☞ పది రూపాయలు జమచేస్తే ఇరవై ఇస్తామంటూ బురిడీ కొట్టించే మాటలను అస్సలు నమ్మొద్దు.
☞ రివ్యూలు రాస్తే, ఓటింగ్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మితే.. మనం మోసపోవడమే కాకుండా నకిలీ సమీక్షల పాపంలో పాలుపంచుకున్నట్టు అవుతుంది.
☞ ప్రతిష్ఠాత్మక వెబ్సైట్ల రివ్యూలనే పరిగణనలోకి తీసుకోవాలి కానీ, ఏ రివ్యూ పడితే దాన్ని చదివేసి ఒక నిశ్చయానికి రావొద్దు.
☞ రివ్యూ ఉచ్చులో చిక్కి డబ్బు కోల్పోతే సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించాలి. 1930 నంబర్‌కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. https://cybercrime.gov.in/ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Tech Tips | సోషల్‌మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి