Social Media Followers | లైకులు రావాలి. షేర్లు కావాలి. సెలెబ్రిటీ అయిపోవాలి. ఇదీ సామాజిక మాధ్యమాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న వారి ఆరాటం! వాళ్ల ఆలోచనలో తప్పులేదు! కానీ, అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నదే ప్రధానాంశం. సబ్‌స్ర్కైబర్లు, ఫాలోవర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవాలనే లక్ష్యంతో కంటెంట్ విషయంలో తప్పులో కాలేస్తుంటారు చాలామంది. దీనివల్ల ఫాలోవర్ల సంఖ్య పెరగకపోగా.. ఉన్నవాళ్లు అన్‌ఫాలో అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సామాజిక మాధ్యమాల్లో సెలెబ్రిటీగా మెరవాలని భావిస్తున్నారా! అయితే, ఈ కింది విషయాలను గమనంలో ఉంచుకోండి. ఏదైనా పోస్ట్ అప్లోడ్ చేసేముందు వీటిని మననం చేసుకోండి.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని పెద్దల మాట! ఈ సూక్తి రోజువారీ జీవితానికే కాదు.. సామాజిక మాధ్యమాల్లో విహరించేటప్పుడూ వర్తిస్తుంది. ఏ రంగంలోనైనా కష్టపడితే గానీ ఒకస్థాయికి చేరుకోలేం. వచ్చిన పేరును నిలబెట్టుకోవడానికి అంతకన్నా ఎక్కువ నిబద్ధతతో కృషి చేయాల్సి ఉంటుంది. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అని నానుడి. ఈ సూత్రం సోషల్ మీడియాలో పేదా, గొప్ప అందరికీ వర్తిస్తుంది. చిన్న తప్పుడు పోస్ట్..అప్పటివరకు కట్టుకున్న కోటలన్నిటినీ కూల్చేస్తుంది. ఈ ముప్పు తప్పాలంటే ఆన్లైన్ మర్యాదకు భంగం వాటిల్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు పలుకుబడి పెంచుకోవడానికి తమ శక్తియుక్తులన్నీ ధారపోస్తుంటారు. కానీ, అది ఎలాంటి పేరు అన్నది ముఖ్యం. నాసిరకం కంటెంట్, నెగెటివిటీ త్వరగా రీచ్ అవుతుందని చాలామంది ఆ మాయలో పడిపోతున్నారు. కానీ, విశ్వసనీయ సమాచారం అందివ్వడం బాధ్యతగా గుర్తెరగాలి. అంచెలంచెలుగా సబ్‌స్ర్కైబర్లు గానీ, ఫాలోవర్స్ గానీ పెరుగుతుంటారు. వైరల్ కావడం కోసం చెత్త పోస్టులు చేయొద్దు. ఇటీవలి కాలంలో వీడియోలు వైరల్ కావాలి, లైకులు వస్తే చాలు అనుకొని చౌకబారు థంబ్‌నెయిల్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. కంటెంట్‌లో లేని విషయాన్ని శీర్షికగా పెట్టి జనాల్లోకి వదులుతున్నారు. దానివల్ల ఆ రోజుకు వీక్షకుల సంఖ్య పెరుగుతుండొచ్చు. మర్నాటికి సబ్‌స్ర్కైబర్ల సంఖ్య వందల్లో పడిపోవడం ఖాయం! ఒక పోస్ట్ చూసే వ్యక్తికి దానివల్ల ఏదైనా ప్రయోజనం కలగాలి. కొత్త విషయం తెలియాలి. వాస్తవం అవగతమవ్వాలి. ఇవేవీ లేకుండా కొత్త అనుమానాలు రేకెత్తించే విధంగా చేసిన పోస్టులు, పెట్టిన వీడియోల వల్ల సదరు ఛానెల్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది.
కంటెంట్ విషయం పక్కన పెడితే.. సబ్‌స్ర్కైబర్లను, ఫాలోవర్స్‌ను కాపాడుకోవడం కూడా పెద్ద టాస్కే! వాళ్లు పట్టుజారి పోవొద్దంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి వీడియోకు ఎక్కువ లైక్‌లు వస్తున్నాయో గమనించాలి. అలాగని ఎక్కువ లైక్‌లు వచ్చిన వీడియో తరహావే పోస్ట్ చేస్తూ వెళ్తే… ఫాలోవర్స్‌కు మొహం మొత్తుతుంది. కామెంట్లు ఎలా వస్తున్నాయో పరిశీలిస్తూ ఉండాలి. పాజిటివ్ కామెంట్స్‌కు తెగ పొంగిపోవద్దు. నెగెటివ్ కామెంట్ రాగానే డీలా పడిపోవద్దు. అది వారి అభిప్రాయంగా గౌరవించాలి. వాదోపవాదాలకు దిగకుండా, అందులోని వాస్తవాన్ని గ్రహించి ముందుకుసాగాలి. పరుష పదజాలంతో కొందరు కామెంట్ చేస్తుంటారు. ఇంకొందరు ట్రోల్స్ చేస్తారు. వాటికి అతిగా స్పందించొద్దు. తిట్లకు అదేస్థాయిలో సమాధానం ఇస్తూపోతే ఆ తిట్ల దండకం వైరల్ అవుతుంది. ఆ ప్రభావం మిగతా ఫాలోవర్స్పైనా పడుతుంది. మనుషుల నమ్మకాలు, మత విశ్వాసాలపై నెగెటివ్ పోస్టులు గానీ, కామెంట్లు గానీ చేయొద్దు. దానివల్ల ఒక్కోసారి తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటి ఇబ్బంది ఎదురైతే జరిగిన నష్టాన్ని వీలైనంత త్వరగా పూడ్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, ఏదైనా పోస్ట్ చేసేముందు ఆ సమాచారం నూటికి నూరు శాతం నిజమైనదే అని రూఢి చేసుకోవాలి. వీడియో అప్లోడ్ చేసేముందు కాపీరైట్స్ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగత ఆసక్తులు ఇతరులపై రుద్దాలనే తాపత్రయం విడిచిపెట్టాలి. సమాజానికి ఏం అవసరం, వీలైనంత పాజిటివిటీని పెంచే దిశగా సామాజిక మాధ్యమంలో ప్రయాణం సాగించాలి.
☞ ప్రచార మాధ్యమాల ద్వారా బ్రాండింగ్ చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం కల్పించాలి.
☞ అనుబంధంగా ఉన్న ఛానెల్స్‌ను ఫాలో అవ్వాలి. అందులో వస్తున్న కంటెంట్‌ను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుండాలి.
☞ ప్రత్యేక సందర్భాల్లో ఫాలోవర్స్‌ను ఎంగేజ్ చేసే విధంగా ప్రణాళికలు అమలు చేయాలి.
☞ కొత్త పోస్టులు రెగ్యులర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఫలానా రోజు న్యూ అప్డేట్ వస్తుందని ఫాలోవర్స్ ఎదురుచూసేలా సమయపాలన పాటించాలి.
☞ సందర్భోచితంగా సరైన హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించే నేర్పు ఉండాలి.
☞ ఇతర బ్లాగర్స్, సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీల వ్యక్తులతో పరస్పర సహకారంతో వ్యవహరించాలి.
☞ కస్టమర్ సర్వీస్ కోసం ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పోస్ట్‌ను లైక్ చేస్తున్న వ్యక్తిని, షేర్ చేస్తున్న వారిని గుర్తించి వారికి సడన్ సర్ప్రైజ్గా టీషర్ట్, కప్ లాంటి చిన్నచిన్న బహుమతులు పంపి వారితో సంబంధాలు పెరిగేలా చూసుకోవాలి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?