trolling | కర్రలు, కత్తులు, రాళ్లు.. భౌతికంగా గాయపరుస్తాయి. కానీ ఒక నింద, ఒక మాట చెట్టంత మనిషిని సైతం కుంగదీస్తుంది. మానసికంగా చంపేస్తుంది. అదీ అపనిందకు ఉన్న నెగెటివ్ శక్తి. ‘గుడ్డ కాల్చి మీదేయడం’ అంటే ఇదే. ట్రోలింగ్‌కు గురై.. నిట్టనిలువునా మునిగిపోయినవారు, అర్ధంతరంగా తనువు చాలించినవారు, ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయినవారు ఎంతోమంది.
మహేశ్ స్వశక్తితో ఎదుగుతున్నాడు. వీధుల్లో పచ్చళ్లు అమ్మడంతో మొదలైన వ్యాపారాన్ని దేశమంతా విస్తరిస్తున్నాడు. ఆ ఎదుగుదల ప్రత్యర్థులకు గిట్టలేదు. అతని బిజినెస్‌ను సర్వనాశనం చేసేందుకు అందరూ ఒక్కటయ్యారు. ఆ ప్రయత్నంలో శత్రువులు ఎంచుకున్న వేదిక ‘సోషల్ మీడియా’. భారీ మొత్తంలో ఓ ఏజెన్సీకి ముడుపులు చెల్లించి.. అతని బలహీనతలు, కుటుంబ వ్యవహారాలపై నిఘా పెట్టించారు. ఎక్కడో పచ్చళ్లలో పురుగులు వస్తే.. మహేశ్ కంపెనీ పచ్చళ్లలోనే వచ్చినట్టు మార్ఫింగ్ చేశారు. ఏదో రోగంతో నోట్లో నురగలొచ్చి ఓ వ్యక్తి చనిపోతే.. మహేశ్ పచ్చళ్ల కారణంగానే చనిపోయినట్లు జనాన్ని నమ్మించారు. ఇలా దొరికిన ప్రతీ అవకాశాన్ని వాడుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి విపరీతంగా ట్రోల్స్ చేయించారు. వాట్సాప్ గ్రూపుల్లో ‘అందరికీ చేరేలా షేర్ చేయండి’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో మహేశ్ పచ్చళ్ల వ్యాపారం కూప్పకూలిపోయింది. అతని కంపెనీల షేర్లు నేలచూపులు చూశాయి. జనం పూనకం వచ్చినట్టు దాడి చేశారు. బ్రాంచ్‌లను ధ్వంసం చేశారు. అలా, ఓ ఔత్సాహిక వ్యాపారవేత్త కలలు కుప్పకూలిపోయాయి.
ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వే సంస్థ ‘వీఆర్సోషల్ డాట్ ఆర్గ్’ తాజా సర్వే ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 3.8 బిలియన్ల మంది సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. వీరిలో దాదాపు 25శాతం మంది ఏదో ఒక రకమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద ప్రకటనలు చేయడం; వర్గాలు, మతాలు, కులాల వారీగా రెచ్చగొట్టడం; ఘర్షణలు సృష్టించడం పరిపాటిగా మారింది. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయడంతో పాటు భావోద్వేగాలతోనూ ఆడుకుంటున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. ఈ వ్యవహారంలో సింహభాగం ‘ట్రోలింగ్’దే. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, చర్చలు పెట్టడం, అవమానకరంగా మాట్లాడటం, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, సమాజంలో ఆ వ్యక్తి పాత్రను తగ్గించడం.. ఇదీ స్థూలంగా ట్రోలింగ్ అంటే. ఇందుకు సోషల్ మీడియా, బ్లాగ్లు, వెబ్
సైట్లు, వాట్సాప్ గ్రూప్‌లు, ఈమెయిల్స్, చర్చావేదికలు వంటి ఆన్లైన్ ఫార్మాట్లను వాడుకుంటారు.
‘ట్రోలింగ్’ ఎందుకు చేస్తున్నారనే అంశంపై ‘ఎండ్ నౌ ఫౌండేషన్’ సంస్థ మూడేండ్లు అధ్యయనం చేసింది. ఈ పరిశీలనలో తేలింది ఏమిటంటే.. కక్షపూరితమైన మానసిక స్థితి, ఇతరుల బాధను చూసి సంతోషపడే తత్వం ఉన్నవారే ఇలా ప్రవర్తిస్తారు. తీవ్రమైన మానసిక సమస్యలున్న వ్యక్తులు విపరీతమైన ట్రోల్స్‌కు దిగుతుంటారు. ఓ వ్యక్తిని ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా దెబ్బతీసేందుకు ట్రోల్స్‌ను ఆయుధంగా ఎంచుకునేవారూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం, వారిని వేధించేలా ఇతరులను ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం.. ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. వీళ్లను తక్కువ అంచనా వేయలేం. సాంకేతికంగా చాలా నైపుణ్యం ఉంటుంది. అతి తెలివి ఎక్కువ. ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి అశ్లీల కంటెంట్‌ను పోస్టు చేస్తారు. కొందరు పిల్లలు అసూయతో బంధు వర్గాన్ని ట్రోల్ చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి.
♦ మీరు కానీ, మీ సంస్థలు కానీ ట్రోలింగ్‌కు గురవుతుంటే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి.
♦ ట్రోల్స్ వ్యాప్తి చేసినవారి సోషల్ మీడియా అకౌంట్లు, వాట్సాప్ గ్రూపులు, మెయిల్స్, వెబ్‌సైట్స్ ద్వారా ఆధారాలు సేకరించి పోలీసులకు సమర్పించాలి.
♦ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. త్వరగా చర్యలు తీసుకుంటారు. మరింతమందికి ఆ ట్రోల్స్ చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
♦ అవసరమైతే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
♦ తప్పని పరిస్థితుల్లో డిజిటల్ వెల్బీయింగ్, ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూప్‌ల సహకారం తీసుకోండి.
♦ ఆన్లైన్ వేధింపులను అడ్డుకునేందుకు ISEA, CDAC విభాగాలు, ఎండ్ నౌ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు, సైబర్ గర్ల్, సైబర్ జాగృతి, CyberSpy, తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వంటివి సహకరిస్తాయి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయా?
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త