బొంరాస్‌పేట, మే 4 : యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండల కేంద్రంలోని భూ లక్ష్మమ్మ చౌరస్తా దగ్గర బడిబాట జీపు యాత్రను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించి, నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వ బడులను కాపాడాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉంటుందని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచింతంగా పొందాలని వెంకటరత్నం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలన్నారు.
విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించడం జరుగుతుందని తెలిపారు. పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించాలని కోరారు.